కూకట్‌పల్లి (విజయక్రాంతి): రాత్రి సమయంలో నిర్మానుష్య ప్రదేశాలల్లో ప్రయాణించే వాహనదారులను లక్ష్యంగా చేసుకుని దారి దోపిడీకి పాల్పడుతున్న నలుగురు సభ్యుల గల ముఠాను కె.పి.హెచ్.బి బాలానగర్ సిసిఎస్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూకట్‌పల్లి ఏసిపి శ్రీనివాస్ రావు నిందితుల వివరాలు వెల్లడించారు. గండి మైసమ్మ దుండిగల్ కు చెందిన బీర్బల్ సింగ్ బీబన్, వలిగొండకు చెందిన బాగేందర్ సింగ్, కాజీపేట చెందిన రవి సింగ్, దుండిగల్ కు చెందిన దండు నగేష్ అనే నలుగురు ఒక ముఠాగా ఏర్పడి దారి దోపిడీలకు పాల్పడుతున్నారు.
దోపిడికి పాల్పడి వచ్చిన సొత్తుతో జల్సాలకు అలవాటు పడి విలాసవంతమైన జీవితం గడపాలని అనుకున్నారు. ఈ క్రమంలోని ఈ నెల 12వ తేదీ రాత్రి కె.పి.హెచ్.బి కాలనీలోని రోడ్ నంబర్ 4లో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తిని అపి తమ బైక్ అడ్డుగా నిలిపి, కత్తితో బెదిరించి సెల్ ఫోన్లు, ఒక బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు. అదేవిధంగా రోడ్ నెంబర్ 1 లో మరో వ్యక్తిని ఆపి సెల్ఫోన్ దొంగిలించి పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బృందాలుగా ఏర్పడి చాకచక్యంగా నిందితులను పట్టుకొని అరెస్ట్ చేసారు. నలుగురు రెండు ద్విచక్రవాహనాలపై రెండు గ్రూపులుగా ఏర్పడి ఒకరు కాపాలా కాస్తూ ఉంటే మరొక గ్రూపు బెదిరించి చోరీలకు పాల్పడే వారని ఏసిపి తెలిపారు. నిందితుల వద్ద నుండి కత్తి, రెండు సెల్ ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనలు స్వాధీనం చేసుకుని రిమాండుకు తరలిస్తున్నామని ఏసిపి తెలియజేశారు.