calender_icon.png 22 April, 2025 | 4:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీకి చిక్కిన నలుగురు అధికారులు

22-04-2025 01:59:32 AM

  1. ఇద్దరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు
  2. రూ.లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మణుగూరు సీఐ 

భద్రాద్రి కొత్తగూడెం/మేడ్చల్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి)/అర్మూర్: రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో సోమవారం నలుగురు అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సీఐగా సతీశ్‌కుమార్.. మండలంలో గుట్ట మల్లారం గ్రామానికి చెందిన భూ వివాదంలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసి, ప్లాట్లు చేసి అమ్ముతున్న వారిపై సీఐ కేసు నమోదు చేశారు.

మణుగూరుకు చెందిన బేతంచర్ల వెంకటేశ్వరరావు, అతని మేనల్లుడు కూరాకుల శ్రీనివాసులను స్టేషన్‌కు పిలిచి ఈ కేసులో మిమ్మల్ని కూడా నమోదు చేస్తానని బెదిరించాడు. లేదంటే రూ.4 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు.

పతకం ప్రకారం సోమవారం సీఐకి మధ్యవర్తిగా ఉన్న ఓ చానల్ రిపోర్టర్ గోపికి రూ.లక్ష ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆ సమయంలో బయట ప్రాంతంలో ఉన్న సీఐని అఅదుపులోకి తీసుకున్నట్టు ఏసీబీ డీఎస్పీ వై రమేష్ తెలిపారు.

చిల్పూర్‌లో ఆర్‌ఐ

జనగామ జిల్లా చిల్పూర్ గ్రామానికి చెందిన ఆవుల లింగయ్య తన తండ్రి సంపాదించిన 1.20 ఎకరాల భూమిని తన సోద రులతో పంచుకుని రెవెన్యూ రికార్డుల్లో తమ పేర్లపైకి మార్చుకోవడానికి ఫిబ్రవరిలో స్లాట్ బుక్ చేసుకున్నారు. సర్వే నిర్వహించి భాగస్వామ్య హక్కుల రిపోర్టు ఇవ్వాలంటే ఆర్‌ఐ వినీత్‌కుమార్ రూ.45 వేలు లంచం అడిగాడు. దీంతో లింగయ్య ఏసీబీ అధికారులను సంప్రదించాడు. సోమవారం బాధితుల నుంచి ఆర్‌ఐ రూ.26 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నామని ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు.

ఆర్మూర్‌లో పంచాయతీరాజ్ ఉద్యోగి

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా శ్రీనివాస్‌శర్మ పనిచేస్తున్నారు. నందిపేట్ మండలం డొంకేశ్వర్ గ్రామంలో వేసిన సీసీ రోడ్డు పనులకు సంబంధించి కాంట్రాక్టర్‌కు రూ.4.75 లక్షల బిల్లులు మంజూరుకు రూ.7,500 లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు.. సోమవారం రూ.7 వేలు శ్రీనివాస్‌కు ఇస్తుండగా పట్టుకున్నట్టు ఏసీబీ డీఎస్పీ శేఖర్‌గౌడ్ తెలిపారు. 

నాగారంలో మున్సిపల్ డీఈఈ, వర్క్ ఇన్‌స్పెక్టర్లు

మేడ్చల్ జిల్లాలోని నాగారం మున్సిపాలిటీలో డీఈఈగా సుదర్శనం రఘు, అవుట్ సోర్సింగ్ వర్క్ ఇన్‌స్పెక్టర్లుగా వి రాకేష్, వి సురేష్ పనిచేస్తున్నారు. నాగారం మున్సిపాలిటీలో సీసీ రోడ్ల నిర్మాణానికి ఒక కాంట్రాక్టర్‌కు రూ.8.5 లక్షలు బిల్లులు విడుదల చేయడానికి డీఈఈ రూ .1.37 లక్షలు అడిగాడు. రూ.లక్ష 30 వేలు ఇస్తానన్న కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించి, వారి సూచనతో సోమవారం మున్సిపల్ కార్యాలయం లో డీఈఈ రఘు చెప్పినట్టుగా వర్క్ ఇన్‌స్పెక్టర్లు సురేష్, రమేశ్‌కు ఇస్తుండగా పట్టుకున్నారు.