సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు
హైదరాబాద్, జనవరి 15 (విజయక్రాంతి): హైకోర్టు న్యాయమూర్తుల పోస్టుల కు నలుగురి పేర్లను సిఫారసు చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. జిల్లా జడ్జీల కోటాలో సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి రేణుక యారా, సిటీ సివిల్ స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జి నందికొండ నర్సింగారావు, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఈ తిరుమలాదేవి, హైకోర్టు రిజిస్ట్రార్ (పరిపాలన) బీఆర్ మధుసూదన్‌రావును తెలం గాణ హైకోర్టు న్యాయమూర్తులుగా సుప్రీంకోర్టు కొలీజియం ఈ నెల 11న సిఫారసు చేసింది.
రేణుక యారా:
హైదరాబాద్‌లో ఐలయ్య, నాగమణి దంపతులకు యారా రేణుక 1973 జూన్ 14న జన్మించారు. హైదరాబాద్ సెయింట్ జార్జి స్కూలులో పాఠశాల విద్యాభ్యాసం, డిగ్రీ కోఠీ ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ, బషీర్‌బాగ్‌లోని పీజీ కాలేజీ ఆఫ్ లాలో 1998లో ఎలెల్బీ, తరువాత ఫిలడెల్ఫియా యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు. 1998లో రాష్ట్ర బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు.
సిటీ సివిల్ కోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. 2012 డిసెంబరులో జిల్లా జడ్జీగా ఎంపికయ్యారు. వరంగల్, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల్లో పనిచేశారు. వ్యాట్ ట్రైబ్యునల్ జ్యుడిషియల్ మెంబరుగాను పనిచేశారు. కొంత కాలం రాష్ట్ర న్యాయసేవాధి కార సంస్థ సభ్యకార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
నందికొండ నర్సింగారావు
హైదరాబాద్‌కు చెందిన నందికొండ పెం టయ్య, మణెమ్మ దంపతులకు 1969 మే 3న నర్సింగారావు జన్మించారు. హైదరాబాద్‌లోనే పాఠశాల, కళాశాల విద్యాభ్యాసం పూర్త య్యాక పీఎంఆర్ లా కాలేజీలో 1995 లో న్యాయశాస్త్రంలో పట్టా పొంది అదే సంవత్సరం రాష్ట్ర బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా ఎన్‌రోల్ చేయించుకున్నారు.
2012లో నేరు గా జిల్లా జడ్జిగా ఎంపికై విశాఖపట్నం అదనపు జిల్లా జడ్జిగా బాధ్యతలు స్వీకరించారు. తరువాత జ్యుడిషియల్ అకాడమీ, గుంటూ రు, వరంగల్, ఎల్బీనగర్, సైబరాబాద్ ఎంఎసెత్జగా, న్యాయశాఖ కార్యదర్శిగా, హైకోర్టు జ్యుడిషియల్, ఇన్ఫ్రా రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహించారు. ప్రస్తుతం సిటీ స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఈ తిరుమలాదేవి
సంగారెడ్డికి చెందిన తిరుమలాదేవి 1964 జూన్ 2న జన్మించారు. హైదరాబాద్‌లో పాఠశాల విద్య పూర్తి చేశారు. న్యాయవాద వృత్తిలో హైకోర్టుతోపాటు జిల్లా కోర్టుల్లో ప్రాక్టీస్ చేశారు. 2012లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. నిజామాబాద్, ఖమ్మం, వరంగల్‌లో, మెట్రో పాలిటన్ సెషన్స్ జడ్జిగా, హైకోర్టు రిజిస్ట్రార్‌గా, తెలంగాణ రాష్ట్ర జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు. ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌గా, విజిలెన్స్ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
బీఆర్ మధుసూదన్‌రావు
వరంగల్ జిల్లా ఖాజీపేటలో బీ ఎల్లయ్య, అనసూయ దంపతులకు 1969 మే 25న మధుసూదన్‌రావు జన్మించారు. రైల్వే హైస్కూలులో పాఠశల విద్య, ఎల్‌ఎల్బీ, ఎల్‌ఎల్‌ఎం కాకతీయ యూనివర్సిటీలో పూర్తిచేశారు. 1998-99లో న్యాయవాదిగా బార్ కౌన్సిల్లో ఎన్‌రోల్ అయ్యారు. 2012 డిసెంబరులో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. నెల్లూరు, చిత్తూరు, మేడ్చల్ మల్కాజిగిరి కోర్టుల్లో, సీబీఐ కోర్టు ప్రధాన జడ్జిగా, వ్యాట్ జ్యుడిషియల్ సభ్యులుగా, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్యకార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రార్ (పరిపాలన)గా విధులు నిర్వహిస్తున్నారు.