- ఆయుధాలతో ఉన్న అధునాతన కార్ల కొనుగోలు
- రూ. 20 కోట్ల పైనే అయిందని సమాచారం..
- సుంకాలతో కలిపితే డబుల్
న్యూఢిల్లీ, జూలై 8: ఇండియాకు వచ్చే పాశ్చాత్య దేశాల నేతల కోసం ఆయుధాలతో లోడ్ అయిన నాలుగు కొత్త మెర్సిడెస్ బెంజ్ కార్లను ప్రభుత్వం దిగుమతి చేసుకుంది. ఈ కార్ల ఖరీదు దాదాపు రూ. 20 కోట్లు. ఇక దిగుమతి చేసుకున్న కార్ల మీద విధించే దిగుమతి సుంకంతో కలుపుకుంటే ఈ కార్ల ఖరీదు రూ. 40 కోట్లకు చేరుకునే అవకాశం ఉండేది. ఈ కార్ల కొనుగోలుకు సుంకం నుంచి మినహాయింపు ఇవ్వాలని విదేశీవ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు ఆర్థిక శాఖ ప్రతినిధులను సంప్రదించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రతిపాదనకు కనుక ఆర్థిక శాఖ ఓకే చెబితే విదేశీవ్యవహారాల శాఖకు భారం తగ్గుతుంది.
వారి కోసమే ఇవి..
మన దేశానికి వేరే దేశాలకు చెందిన ప్రముఖ ప్రతినిధులు వస్తే వారి సెక్యూరిటీ కోసం ఈ కార్లను ఉపయోగించనున్నారు. ముఖ్యంగా వీవీఐపీలకే ఈ కార్లను కేటాయించనున్నారు. మన దేశానికి చెందిన ప్రతినిధులు ఎవరైనా విదేశాలకు వెళ్తే.. విదేశాల్లో వారికి ఆయధాలతో ఉన్న వాహనాలను సమకూరుస్తారు. ఇన్ని రోజులు ఇండియాలో అటువంటి విధానం ఉండేది కాదు. కానీ ప్రస్తుతం ఈ కార్ల కొనుగోలుతో ఆ లోటు తీరినట్లయింది. మనం కూడా వేరే దేశాలకు చెందిన ముఖ్య ప్రతినిధులకు ఆయధాలతో ఉన్న కార్లను కేటాయించే అవకాశం ఉంటుంది. ఇన్ని రోజులో అందుబాటులో ఉన్న పాత వాహనాల స్థానంలో ఇప్పుడు కొత్త మెర్సిడెస్ కార్లు వచ్చి చేరాయి.