మహానగరంలో మహలక్ష్మిప్రయాణీకులు
ప్రతిరోజూ 14లక్షల మహిళల ప్రయాణం
ఆర్టీసీకి రూ. 32.94కోట్ల ఆదాయం
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వం 2023 డిసెంబరు 7న ఏర్పాటు కాగా డిసెంబరు 9న ఆరు గ్యారంటీల్లో ప్రధానమైన వాగ్దానం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం మహలక్ష్మి పథకాన్ని ప్రారంభించింది. మహిళ లకు ఉచిత ప్రయాణాన్ని డిసెంబరు 9నుంచి అందుబాటులోకి తీసుకొచ్చినా.. డిసెంబరు 15నుంచి ఆర్టీసీలో సాంకేతిక పరిజ్ఞానంతో అందుబాటులోకి వచ్చింది. ఈ ఆరు రోజుల పాటు గణాంకాల నమోదుకు సాఫ్ట్‌వేర్ అందుబాటులో లేకపోయినా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఆర్టీసీ కల్పించింది. హైదరాబాద్ మహానగరంలో మహలక్ష్మి పథకం ద్వారా 2023 డిసెంబరు 15నుంచి 2024 మార్చి 31వరకు 14కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేసినట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
4నెలల్లో 14కోట్ల మంది ప్రయాణం
గ్రేటర్ వ్యాప్తంగా 25డిపోల పరిధిలో 2800 బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. ఈ సమయంలో గ్రేటర్ వ్యాప్తంగా ప్రతిరోజూ 11లక్షలకు పైగా ప్రయాణం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన డిసెంబరు 9 నుంచి గ్రేటర్ ఆర్టీసీలో ప్రయాణించే ప్రయాణీకుల సంఖ్య16 నుంచి 17లక్షలకు పెరిగింది. ఈ ప్రయాణీకుల్లో దాదాపు 53శాతానికి పైగా మహిళలే ఉండటం గమనార్హం. పథకం ప్రారంభమైన నుంచి మహిళల ప్రయాణం రోజురోజుకు పెరుగుతోంది. డిసెంబరు నెలలో ప్రతిరోజూ 11.68లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణీంచగా, జనవరిలో ప్రతిరోజూ 13.49లక్షలు, ఫిబ్రవరిలో 13.49 లక్షలు, మార్చి నెలలో 13.75 లక్షల మంది ప్రయాణించారు. మొత్తం డిసెంబరు నెలలో 1.98 కోట్లు, జనవరిలో 3.93 కోట్లు, ఫిబ్రవరిలో 3.91 కోట్లు, మార్చిలో 4.26 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ నాలుగు నెలల్లో మొత్తం 14,09,95000 మంది ప్రయాణించారు.
గ్రేటర్‌లో ఆర్టీసీకి రూ. 329కోట్ల ఆదాయం
మహలక్ష్మి పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళలు ఆధార్ లేదా ఓటరు గుర్తింపు కార్డును చూపి ఉచిత ప్రయాణం టికెట్‌ను పొందుతున్నారు. ఈ సమయంలో ఆర్టీసీ ఇచ్చే టికెట్ ధరను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. దీంతో ప్రతినెలా ఉచిత ప్రయాణంలో జారీ చేసిన టికెట్‌లకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లిస్తోంది. ఈ మేరకు డిసెంబరు నెలలో రూ. 47.57 కోట్లు, జనవరిలో 92.98కోట్లు, ఫిబ్రవరిలో 91.89 కోట్లు, మార్చి నెలలో 96.97 కోట్ల ఆదాయం ఆర్టీసీకి ఆదాయం లభించింది. మొత్తం ఈ నాలుగు నెలల్లో ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి జమ చేస్తోంది. పథకం కంటే ముందు గ్రేటర్ వ్యాప్తంగా అన్ని రకాల బస్‌పాస్‌లు కలిపి దాదాపు 4.50 లక్షలకు పైగా ఉండగా, మహిళలకు ఉచిత ప్రయాణం తర్వాత 2.82లక్షల మంది మాత్రమే బస్‌పాస్‌లు జారీ అవుతున్నాయి. ఒకవైపు బస్‌పాస్‌ల ద్వారా వచ్చే ఆదాయం ఆర్టీసీ కోల్పోతున్నా.. మరో వైపు మహిళా ప్రయాణీకుల సంఖ్య విపరీతంగా పెరగడంతో ఆదాయం మరింత పెరుగుతున్నట్టు సమాచారం.