calender_icon.png 19 October, 2024 | 6:10 PM

4 కిలోల బంగారు నగలు చోరీ

28-07-2024 04:00:21 AM

  1. దాబా వద్ద నిలిపి ఉంచిన బస్సులో నుంచి అపహరణకు గురైన బ్యాగు 
  2. హైదరాబాద్ నుంచి ముంబైకి నగలు తీసుకెళ్తుండగా దొంగతనం 
  3. విచారణ చేస్తున్న పోలీసులు

సంగారెడ్డి, జూలై 27 (విజయక్రాంతి)/ జహీరాబాద్: హైదరాబాద్ నుంచి ముంబై వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీ చోరీ జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఆరెంజ్ ట్రావెల్స్ బస్సును శుక్రవారం రాత్రి 11.45 గంటల ప్రాంతంలో జహీరాబాద్ మండలంలోని సత్వార్ శివారులో ఉన్న కోహినూర్ దాబా వద్ద నిలిపారు. ప్రయాణికులంతా భోజనం, టీ కోసమని కిందకు దిగారు. వారితో పాటు ఆశిష్ అనే ప్రయాణికుడు సైతం తన వద్ద ఉన్న బ్యాగును బస్సులోనే ఉంచి టీ తాగేందుకని బస్సు దిగాడు.

అయితే, ఆ బ్యాగులో 4 కిలోల బంగారు నగలు ఉన్నాయి. టీ తాగిన అనంతరం బస్సు ఎక్కి చూడగా బ్యాగు కనిపించలేదు. మొత్తం వెతికినా బ్యాగు కనిపించకపోవడంతో దాబా యజమానికి తెలియజేశాడు. దీంతో అతను చెరాగ్‌పల్లి పోలీసులకు సమాచారం అందించాలని సూచించాడు. పోలీసు లకు ఫిర్యాదు చేయగా జహీరాబాద్ డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి, జహీరాబాద్ పట్టణ సీఐ శివలింగం, చెరాగ్‌పల్లి ఎస్సై రాజేందర్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దొంగతనం ఎవరు చేశారనే దానిపై విచారణ జరుపుతున్నారు. 

బంగారం ఇచ్చి నగలు తీసుకెళ్తుండగా..

ముంబైకి చెందిన పలువురు బంగారం వ్యాపారులు హైదరాబాద్‌కు బంగారం తీసుకొచ్చి ఇక్కడ నగలు చేయించి తీసుకె ళ్తుంటారు. ముంబాయికి చెందిన బం గారం వ్యాపారి వద్ద ఉద్యోగిగా పనిచేస్తున్న ఆశిష్ హైదరాబాద్ నుంచి బంగారు నగలు తీసుకొని ముంబై వెళ్తుండగా దొంగతనం జరిగిం ది. కాగా, చోరీపై పోలీసులు పలు కోణాల్లో విచారణ జరుపుతున్నారు. బస్సును దాబా వద్ద నిలిపిన వెంటనే ఇద్దరు దొంగలు బస్సులోకి ఎక్కడం సీసీ కెమెరాలో రికార్డు అయింది. వారే బ్యాగు తీసుకొని పోయినట్లు పోలీసులు తెలిపారు.

చోరీపై అనుమానాలు..

అయితే, 4 కిలోల బంగారు నగలను బస్సులోనే ఉంచి ఆశిష్ కిందకు ఎందుకు దిగాడు.. నగలు ఉన్న  బ్యాగు వద్దకు దొంగ లు నేరుగా ఎలా వెళ్లారు అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ మేరకు చెరాగ్‌పల్లి పోలీసు స్టేషన్‌లో ఆశిష్‌ను పోలీసులు విచారించారు.