- డిజిటలైజేషన్ పెరిగినా, బ్యాంక్ బ్రాంచ్‌లు కావాల్సిందే
చైర్మన్ దినేశ్ ఖారా
న్యూఢిల్లీ, జూన్ 23: తమ నెట్‌వర్క్ విస్తరణ ప్రణాళికలో భాగంగా బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 400 శాఖల్ని ఏర్పాటు చేయనున్నది. గత ఆర్థిక సంవత్సరంలో ఎస్బీఐ 157 కొత్త శాఖల్ని ప్రారంభించగా, అందులో 59 గ్రామీణ శాఖల్ని ఏర్పాటు చేసింది. కొత్త శాఖల ఏర్పాటును ఎస్బీఐ చైర్మన్ దినేశ్ ఖారా పీటీఐ ప్రతినిధికి వెల్లడిస్తూ ‘బ్రాంచ్ వెలుపలే 89 శాతం డిజిటల్ బ్యాంకింగ్, 98 శాతం లావాదేవీలు జరుగుతున్నపుడు ఇంకా కొత్త శాఖలు అవసరమా అని నన్ను కొంతమంది ప్రశ్నించారు.
దానికి నేను చెప్పే సమాధానం అవుననే. ఎందుకంటే బ్యాంకింగ్‌లో కొత్త ఏరియాలు ఆవిర్భవిస్తున్నాయి’ అని చెప్పారు. అడ్వయిజరీ, వెల్త్ సర్వీసుల వంటి కొన్ని సేవల్ని కేవలం శాఖ ద్వారానే అందించడం సాధ్యపడుతుందని ఖారా తెలిపారు. ఈ అవకాశాలు ఉన్న ప్రాంతాల కోసం తాము అన్వేషిస్తున్నామని, అటువంటి ప్రాంతాల్లో కొత్త శాఖల్ని ఏర్పాటు చేస్తామన్నారు.ఎస్బీఐకి 2024 మార్చి చివరినాటికి దేశవ్యాప్తంగా 22,542 శాఖల నెట్‌వర్క్ ఉన్నది.
సబ్సిడరీల లిస్టింగ్‌కు వేచిచూస్తాం
తమ సబ్సిడరీ కంపెనీలు ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్, ఎస్బీఐ పేమెంట్ సర్వీసెస్‌లు వాటి వ్యాపారాన్ని పెంచుకునేంతవరకూ స్టేట్ బ్యాంక్ వేచిచూస్తుందని, అప్పుడే వాటిని స్టాక్ ఎక్సేంజీల్లో లిస్ట్ చేస్తామని ఖారా వెల్లడించారు. తమ సబ్సిడరీల్లో తొలుత ఒకదశ లో ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) జారీచేసి విలువను రాబడతామని , తదుపరి దశలో ఎస్బీఐ పేమెంట్ సర్వీసులను మానిటైజ్ చేస్తామని సూచనాప్రాయంగా వెల్లడించారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అటువంటి ప్రణాళిక ఏదీ లేదని స్పష్టం చేశారు. ముందుగా వాటి కార్యకలాపాల్ని పెంచాలని చూస్తున్నామని, అటుతర్వాత ఈ కంపెనీల్లో తమ వాటా విలువను సొమ్ము చేస్తామన్నారు. ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్‌లో 2024 మార్చి 31 తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.489.67 కోట్ల అదనపు మూలధనాన్ని మాతృసంస్థ ఎస్బీఐ పెట్టుబడి చేసింది. తదుపరి ఈ ఇన్సూరెన్స్ కంపెనీ తన ఉద్యోగులుక స్టాక్ ఆప్షన్స్ ఇచ్చింది. దీంతో ఇందులో ఎస్బీఐ వాటా 69.95 శాతం నుంచి 69.11 శాతానికి తగ్గింది.
2024 మార్చితో ముగిసిన సంవత్సరంలో ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ నికరలాభం 30.4 శాతం వృద్ధితో రూ.184 కోట్ల నుంచి రూ. 240 కోట్లకు చేరింది. మర్చెంట్ ఎక్వైరింగ్ బిజినెస్‌లో ఉన్న ఎస్బీఐ పేమెంట్ సర్వీసెస్ ప్రైవే ట్ లిమిటెడ్‌లో ఎస్బీఐకి 74 శాతం వాటా ఉండగా, మిగిలిన వాటా హిటాచి పేమెంట్ సర్వీసెస్ వద్ద ఉన్నది. ఈ కంపెనీకి 2024 మార్చినాటికి దేశంలో 13.47 లక్షల పీఓఎస్ మెషిన్లతో సహా 33.10 లక్షల మర్చెంట్ పేమెంట్ యాక్సెప్టెన్స్ టచ్ పాయింట్లు ఉన్నాయి. అయితే ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కంపనీ నికరలాభం రూ.159.34 కోట్ల నుంచి రూ. 144.36 కోట్లకు తగ్గింది.