calender_icon.png 17 November, 2024 | 5:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీటి పారుదల శాఖకు 483 కోట్లివ్వండి

15-09-2024 12:42:00 AM

  1. కేంద్రానికి నీటి పారుదల శాఖ నివేదిక
  2. రాష్ట్రంలో 773 చెరువులు, కాలువలకు గండ్లు
  3. నేడు హుజూర్‌నగర్, కోదాడకు మంత్రి ఉత్తమ్
  4. పునరుద్ధరణ పనులను పరిశీలించనున్న మంత్రి

హైదరాబాద్, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలకు నీటి పారుదల శాఖకు అపార నష్టం వాటిల్లిందని తెలుపుతూ కేంద్ర సహాయం కోరుతూ ఓ నివేదికను అధికారులు పంపారు. తాత్కాలిక మరమ్మతులకు రూ. 75 కోట్లు, శాశ్వత పునరుద్ధరణకు రూ. 483 కోట్ల అంచనాతో రూపొందించిన నివేదికను కేంద్రానికి ప్రభుత్వం అందచేసిందని తెలిపారు. ఈ మేరకు కేంద్రానికి పంపిన నివేదికలో పేర్కొన్న అంశాలను ప్రెస్‌నోట్ లో అధికారులు నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 773 చెరువులకు, కాలువలకు గండ్లు పడ్డాయని తెలిపారు.

ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో  భారీగా నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. పాలేరు రిజర్వాయర్ బ్యాక్ వాటర్‌తో సాగర్ ఎడమ కాలువకు గండ్లు పడ్డాయని, సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగితం రామచంద్రపురం వద్ద సాగర్ ఎడమ కాలువకు గండి పడటంతో ఆ ప్రభావం కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాలపై పడిందని అధికారులు వెల్లడించారు.

చెరువులు, కాలువలు, పంప్‌హౌజ్‌లు, చెక్‌డ్యాంల పునరుద్ధరణకు సీఎం రేవంత్ రెడ్డిని ఒప్పించి నీటి పారుదల శాఖ మంత్రి  తక్షణం నిధులు విడుదల చేయించి పునరుద్ధరణ పనులు వేగంగా జరిగేలా చూశారని అధికారులు వెల్లడించారు. నష్టం అంచనాలను పూర్తి స్థాయిలో రూపొందించారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా  తాత్కాలిక పద్ధతితో పాటు శాశ్వత పునరుద్ధరణ పనులు  చేసేలా ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. 

మునిగిన వట్టెం పంప్ హౌజ్.. 

నీటి పారుదల శాఖ పరిధిలో చెరువులకు 265 గండ్లు పడగా 285 చెరువులు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. కాలువలకు 132 చోట్ల గండ్లు పడగా 83 చోట్ల దెబ్బతిన్నాయని వివరించారు. నాగర్ కర్నూలు జిల్లాలో వట్టెం పంప్ హౌజ్ మునిగిపోయిందని, ఖమ్మం జిల్లాలో భక్త రామదాసు లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ హౌజ్ మునిగిపోయి పంప్ హౌజ్ పరికరాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. 

నేడు ఉత్తమ్ పర్యటన..

కోదాడ నియోజకవర్గ పరిధిలోని నడిగూడెం మండలం కాగితం రామచంద్రపురం వద్ద సాగర్ ఎడమ కాలువను, హుజూర్‌నగర్ మండలం కరక్కాయలగూడెం వద్ద ముక్త్యాల బ్రాంచ్ కెనాల్‌ను ఆదివారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించనున్నారు. దీంతో పాటు కోదాడ మండలం పరిధిలోని రెడ్లకుంట, మఠంపల్లి చెరువులను కూడా  మంత్రి ఉత్తమ్  పరిశీలిస్తారు.