23-02-2025 12:30:39 AM
కొత్తకోట, పెద్దమందడి, పెబ్బేర్ మండలంలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన
పామాయిల్ ఫ్యాక్టరీ త్వరలోనే అందుబాటులోకి రానున్నది ... రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి
పర్యావరణ హానికర వ్యర్థాలు లేకుండా చర్యలు తీసుకోవాలి... దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి
జిల్లాలో 10వేల ఎకరాలకు పామాయిల్ విస్తరించేలా చర్యలు తీసుకుంటాం... వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
వనపర్తి,విజయక్రాంతి): దేశంలో ఉన్న మంచి నూనె కొరతను అధిగమించి ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగేందుకు అత్యధికంగా పామాయిల్ సాగుని పెంచాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పిలుపునిచ్చారు. శనివారం రాష్ట్ర ఆబ్కారి, పర్యాటక, సాంస్కృత్రిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి వనపర్తి జిల్లాలో పర్యటించి దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లి గ్రామంలో ప్రీయునిక్ సంస్థ ద్వారా నిర్మించనున్న పామాయిల్ ఫ్యాక్టరీ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా పామాయిల్ రైతులతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ భారతదేశంలో ప్రజలకు అవసరమైన మేరకు వంట నూనె ఉత్పత్తి లేకపోవడం వల్ల ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నామని తద్వార మన ఫారెన్ నిల్వలు ఇతర దేశాలకు చెల్లించడం జరుగుతుందన్నారు. దేశంలో వంట నూనెల లోటు భర్తీ చేయాలంటే 70 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు చేయాల్సిన అవసరం ఉందన్నారు. పామాయిల్ సాగుకు ప్రభుత్వం ద్వారా ఎకరాకు రూ 51వేల సబ్సిడి ఇస్తుందన్నారు. ఆయిల్ ఫామ్ కంపెనీ వారు రైతులతో ఇప్పందం చేసుకుని పంట చేతికి వచ్చాక నేరుగా కంపెనీ వారే కొనుగోలు చేస్తారన్నారు. ప్రస్తుతం పామాయిల్ గెలలు మార్కెట్‌లో టన్నుకు రూ 20487 ధర పలుకుతుందని త్వరలోనే రూ 25వేలకు చేరుకుంటుందన్నారు. ఇప్పుడు భూమి పూజ చేస్తున్న పామాయిల్ కంపెనీ ఆగస్టు 15వ తేది నాటికి ప్రారంభోత్సవం చేస్తామని అదేవిధంగా గద్వాల జిల్లా బీచ్‌పల్లి వద్ద వేరుశెనుగ ఆయిల్ కంపెనీ మరమ్మతులు చేసి పామాయిల్ కంపెనీగా ఇదే సంవత్సరంలో ప్రారంభించుకుంటామని భరోసాను ఇచ్చారు.
పామాయిల్ ఫ్యాక్టరీ త్వరలోనే అందుబాటులోకి రానున్నది: రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి
వనపర్తి జిల్లా ప్రజలు ఎన్నో రోజుల నుండి ఎదురుచూస్తున్న పామాయిల్ కంపెనీ ఎట్టకేలకు శనివారం భూమి పూజ చేసుకోవడం జరిగిందని త్వరలోనే నిర్మాణం పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకు రావాలని ప్రీయునిక్ సంస్థను రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి కోరారు. జిల్లాలో ఇది వరకే సాగు చేసిన పంటకు గెలలు కోతకు వస్తున్నాయని వాటిని కోసిన 24 గంటల్లో ఆయిల్ గా మార్చాల్సి ఉంటుందని లేనియెడల అది పనికి రాకుండా పోతుందన్నారు.
పర్యావరణ హానికర వ్యర్థాలు లేకుండా చర్యలు తీసుకోవాలి: దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి
సంకిరెడ్డి పల్లి లో పామాయిల్ కంపెనీ ఏర్పాటు వల్ల పర్యావరణ హానికర వ్యర్థాలు లేకుండా చర్యలను తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావును దేవరకద్ర ఎమ్మెల్యే మధు సూదన్ రెడ్డి కోరారు. దేవరకద్ర నియోజక వర్గంలో మరో 10 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాంను మంజూరు చేయాలన్నారు. ఆయిల్ ఫామ్ కంపెనీలో పనిచేసేందుకు ఈ ప్రాంత ప్రజలకే ఉద్యోగ అవకాశం కల్పించే విధంగా ఆదేశాలు ఇవ్వాలన్నారు.
జిల్లాలో 10వేల ఎకరాలకు పామాయిల్ విస్తరించేలా చర్యలు తీసుకుంటాం: వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
వనపర్తి జిల్లాలో 1680 మంది రైతులు 5500 ఎకరాల్లో పామాయిల్ సాగు చేస్తున్నారని త్వరలోనే 10 వేల ఎకరాలకు సాగు విస్తీర్ణం పెంచే విధంగా చర్యలను తీసుకుంటామని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. ఉద్యానవన శాఖలో సిబ్బంది కొరత ఉందని వాటిని భర్తీ చేసే విధంగా చర్యలను తీసుకోవాలని, మూడు వంతెనల నిర్మాణాలకు అనుమతులు తీసుకున్నామని జిల్లాలో వేరుశెనుగ సాగు ఎక్కువగా ఉన్నందున పెద్దమందడి మండలంలో వేరుశెనుగ పరిశోధన కేంద్రం మంజూరు చేయాల్సిందింగా మంత్రిని కోరారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఉద్యానవన శాఖ మేనేజింగ్ డైరెక్టర్ షేక్ యాస్మిన్ భాషా, డిసిసిబి చైర్మన్ విష్ణువర్థన్ రెడ్డి, ఆయిల్ ఫెడ్ చైర్మన్ రాఘవరెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి సైతం మాట్లాడారు.
పలు అభివృద్ది పనుల శంఖుస్థాపన వివరాలు
పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలో రూ 20 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఉప వైద్య కేంద్ర భవనం, మోజర్ల గ్రామంలో రూ 8.38 కోట్లతో ఏర్పాటు చేయనున్న 10వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన వ్యవసాయ గోదాం, పెబ్బేర్ లో రూ 5.50 కోట్ల వ్యయంతో 5వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల మరో వ్యవసాయ గోదాం. రూ 44 లక్షలతో వ్యవసాయ కార్యాలయ అదనపు భవన నిర్మాణానికి, రూ 3 కోట్లతో పెబ్బేర్‌లో ఇంతకు ముందు కాలిపోయిన మార్కెట్ యార్డు గోదాం పునర్నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.