02-04-2025 01:19:03 AM
రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నల్లగొండ, యాదాద్రి జిల్లాల్లో బియ్యం పంపిణీ
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
నల్లగొండ / యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 1 (విజయక్రాంతి) : సన్నబియ్యం పథకం పేదల ఆత్మగౌరవమని, చరిత్రలో నిలిచిపోయే పథకమని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లా కనగల్ మండలం, జీ.యడవల్లి, యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో సన్నబియ్యం పంపిణీని మంగళవారం లాంఛనంగా ఆయన ప్రారంభించి మట్లాడారు. పేదలు కడుపునిండా తినాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీని ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు.
ఒక్క రేషన్ కార్డు ఇవ్వని చరిత్ర బీఆర్‌ఎస్ది..
పదేండ్లలో ఒక్క రేషన్కార్డు కూడా ఇవ్వని చరిత్ర గత బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదని విమర్శించారు. పదేండ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకున్నారని ఆరోపించారు. దక్షిణ తెలంగాణను ఎండబెట్టి ఆంధ్రాకు నీళ్లు తీసుకెళ్లి, ఎస్‌ఎల్బీసీని గాలికొదిలేసి నల్లగొండ జిల్లావాసులకు మాజీ సీఎం కేసీఆర్ తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎస్సెల్బీసీ టన్నెల్ పూర్తి చేసేందుకు బడ్జెట్లో రూ. 4518 కోట్లు కేటాయించిందని పేర్కొన్నారు. టన్నెల్ మిషన్ బేరింగ్ అమెరికా నుంచి తెప్పించి పనులు ప్రారంభించినా దురదృష్టవశాత్తు టన్నెల్ కూలిపోయి పనులు ఆగిపోయాయన్నారు. ఆలస్యమైన టన్నెల్ను పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
3 కోట్ల మందికిపైగా సన్నబియ్యం..
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో 3 కోట్ల 10 లక్షల మందికి సన్నబియ్యాన్ని ఇవ్వనుందని తెలిపారు. మహిళల ఉచిత ఆర్టీసీ ప్రయాణానికి ఇప్పటివరకు రూ.4 వేల కోట్లు వెచ్చించామని వెల్లడించారు. కనగల్ మండలంలో 20 ఏండ్ల క్రితం తాను 500 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామని గుర్తు చేశారు. రూ.కోటి 30 లక్షలతో జీ.యడవల్లి చెరువు అలుగు గండి మరమ్మతులు చేయించనున్నట్లు ప్రకటించారు. ఈ నెల 7న బక్కతాయికుంట, నర్సింగ్ బట్ల ఎత్తిపోతల పనులకు శంకుస్థాపన చేస్తామన్నారు. యాదాద్రి జిల్లాలో రూ. 210 కోట్లతో గంధమల్ల, బస్వా పూర్ రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి చేసినట్లు గుర్తు చేశారు.
నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాసం పథకానికి ఈ నెల14 వరకు ప్రభుత్వం గడువు పొడిగించిందని చెప్పారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కారు సంక్షేమ పథకాల్లో మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నదన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా పనిచేస్తున్నదని పేర్కొన్నారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్రెడ్డి మాట్లాడుతూ.. సన్నబియ్యం పంపిణీ పథకం గొప్పదని, దేశంలో ఏరాష్ట్రంలోనూ అమలుకు సాధ్యం కానిది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపిందన్నారు. అర్హులందరూ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.