- అధునాతన వసతులతో..
- నిర్మాణ పనుల్లో రాజీ పడొద్దు..
- సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
హైదరాబాద్,జనవరి 25(విజయ క్రాంతి): ఉస్మానియా కొత్త ఆసుపత్రి విషయంలో రాజీ వద్దని, ఆసుపత్రి లో అన్ని అధునాతన వసతులు ఉండేలా నిర్మాణం చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈ నెల 31న సీఎం నూతన ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న నేప థ్యంలో శనివారం సీఎం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో వైద్యారోగ్య శాఖతో పాటు పలు శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సం దర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఆసుపత్రితో పాటు బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులకు వేర్వేరుగా వసతి గృహాలు నిర్మించాలని సూచించారు. పార్కింగ్, ల్యాండ్ స్కేప్ విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలని ఆదేశించారు. ఆసుపత్రిలోకి ప్రవేశించేందుకు, తిరిగి వెళ్లేందుకు నాలుగు వైపులా ప్రవేశ ద్వారాలు ఉండాలన్నారు.
అవసరమైన చోట ఇతర మార్గాలను కలుపుతూ అండర్‌పాస్‌లు నిర్మించాలని సూచిం చారు. ఆసుపత్రికి వచ్చే రోగులు, సహాయకులు, పరామర్శకు వచ్చే వారి వాహనాలు నిలిపేందుకు వీలుగా అండర్‌గ్రౌండ్‌లో రెండు ఫ్లోర్లలో పార్కింగ్ స్థలం కేటాయించాలన్నారు. డార్మిటరీ, ఫైర్ స్టేషన్, క్యాంటిన్, మూత్రశాలలు నిర్మించాలన్నారు.
వృద్ధులు మృతిచెందిన తర్వాత, వారి పిల్లలు ఇతర ప్రాంతాల నుంచి వ్యయప్రయాసలకోర్చి వస్తున్నారని, అప్పటివరకు మృతదేహాలను భద్రపరిచేందుకు వీలుగా మార్చురీ, బాడీ ఫ్రీజింగ్ బాక్సులు సిద్ధం చేయాలని సూచించారు. అవయవ మార్పిడి సమయాల్లో కొన్నిసార్లు హెలీ అంబులెన్స్‌లు వినియోగిస్తున్నందున, ఆవరణలో హెలీప్యాడ్ నిర్మించాలని ఆదేశించారు.
ఆసుపత్రిలో అడుగుపెట్టగానే ఆహ్లాదకర వాతావరణం ఉండాలని, ఆసుపత్రికి వచ్చామనే ఎవరికీ భావన కలుగకూడదన్నారు. సమీక్షలో వైద్యారోగ్యశాఖ మంత్రి రాజనర్సింహ, సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, రాష్ట్రప్రభుత్వ సలహాదారు (మౌలిక వసతులు) శ్రీనివాసరాజు, సీఎం సంయుక్త కార్యదర్శి సంగీత సత్యనారాయణ, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తూ, ఫ్లాగ్ షిప్ ప్రోగ్రామ్స్ కమిషనర్ శశాంక, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు.