calender_icon.png 6 January, 2025 | 1:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరలో ఏఐ సిటీకి శంకుస్థాపన

04-01-2025 02:08:36 AM

రాష్ట్రంలో బ్లాక్ చైన్ సిటీ ఏర్పాటు

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడి

హైదరాబాద్, జనవరి 3 (విజయక్రాంతి): కొత్త సాంకేతికతల ఆవిష్కరణల్లో తెలంగాణను నంబర్‌వన్‌గా నిలిపేందుకు ప్రణాళికలను రూపొందించామని, వాటి అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో బ్లాక్ చైన్ సిటీని ఏర్పాటుపై ఇప్పటికే నిపుణులతో సంప్రదింపులు ప్రారంభించినట్లు చెప్పారు.

శుక్రవారం మాదాపూర్‌లో డ్రోన్ టెక్నాలజీ, రోబోటిక్స్ రంగంలో సుమారు 1,800 మందికి ఉపాధి కల్పిస్తున్న ‘సెంటిలియన్ నెట్‌వర్క్స్ అండ్ హెసీ రోబోటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్’ నూతన క్యాంపస్‌ను మంత్రి ప్రారంభించారు. అన్ని రంగాల్లో యువతకు స్కిల్స్ యూనివర్సిటీ, పరిశ్రమల సహకారంతో శిక్షణఇచ్చి, ఉపాధి కల్పించేలా చర్యలు చేపట్టినట్లు చెప్పారు.

పౌర సేవలను చివరివ్యక్తి వరకు సమర్థవంతంగా అందించాలనే లక్ష్యంతో తమ సర్కారు ముందుకు సాగుతోందన్నారు. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఏఐ, బ్లాక్ చైన్ తదితర సాంకేతికతలను వినియోగించుకోబోతున్నామన్నారు. ఫ్యూచర్ సిటీలో నిర్మించతలపెట్టిన ఏఐ సిటీకి తొందర్లోనే శంకుస్థాపన చేయనున్నట్లు స్పష్టం చేశారు.

ప్రత్యేకంగా క్వాంటమ్ కంప్యూటింగ్‌లో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. ఇటీవలి కాలంలో కీలకంగా మారిన డ్రోన్ టెక్నాలజీపై తెలంగాణ యువతకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వబోతున్నామన్నారు. తద్వారా యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

దేశం లో ఫ్రాంటియర్ టెక్నాలజీ హబ్‌ను ఏర్పాటు చేసే యోచనలో కేంద్రం ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. ఆ హబ్‌ను హైదరాబాద్‌లో ఏర్పా టు చేయాలంటూ ఇప్పటికే కేంద్రాన్ని కోరినట్లు స్పష్టం చేశారు. ఇక్కడి అనుకూలతలను కేంద్రానికి ప్రత్యేకంగా వివరించామని, ఈ విష యంలో కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నామన్నారు.

సంచార ప్రయోగశాలతో నూతన ఆలోచనలు

సంచార ప్రయోగశాలు విద్యార్థుల్లో నూతన ఆలోచనలు, సృజనాత్మకతకు దోహదపడతాయని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానంపై ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించి వారిలో ఆసక్తి కలిగించేందుకు రూపొందించిన ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్ (ఎఫ్‌ఎల్‌ఓడబ్ల్యూ) వాహనాన్ని మంత్రి శ్రీధర్ బాబు శుక్రవారం సచివాలయంలో జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టెక్నాలజీపై విద్యార్థులకు ఆసక్తిని కల్పించడంలో ఈ సంచార ప్రయోగశాల దోహదపడుతుందని మంత్రి చెప్పారు. ఈ వాహనాలను విద్యార్థులకు చేరువయ్యేలా చేసి.. వారిలో టెక్నాలజీ పట్ల ఆసక్తి పెరిగేలా చేయాలని కలెక్టర్లు, ఉన్నతాధికారులు, డీఈఓలను ఆదేశించారు.

తాను చదువుకునే రోజుల్లో ఇటువంటి ల్యాబ్‌లు అందుబాటులో ఉంటే ఇంకా ఉన్నత స్థాయికి చేరేవాడినని ఈ సందర్భంగా మంత్రి చెప్పుకొచ్చారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, వర్చువల్ రియాలిటీ, రోబోటిక్స్, 3డీ ప్రింటింగ్, మెషిన్ లెర్నింగ్‌లతో కూడిన పరికరాలు, నిపుణులతో కూడిన ఈ ప్రత్యేక వాహనం 33 జిల్లాల్లోని ప్రభుత్వ స్కూల్ విద్యార్థుల వద్దకు వెళ్లనుంది.

కలాం స్ఫూర్తి యాత్ర-33 పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థ ఈ వాహనాన్ని రూపొందించింది. దీనికి లక్ష డాలర్ల ఖర్చు కాగా.. కార్పోరేట్ సామాజిక బాధ్యత కింద ‘సేల్స్ ఫోర్స్ ఇండియా’ సంస్థ ఆ మొత్తాన్ని అందించింది. ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్ సంస్థకు వందేమాతరం ఫౌండేషన్, తెలంగాణా ఇన్నోవేషన్ సెల్‌లు సహకారాన్ని అందించారు.  కార్యక్రమంలో సీఈఓ మధులాశ్, సలహాదారు వికాస్ కాట్రగడ్డ తదితరులు పాల్గొన్నారు.

సీఎం మాటలను వక్రీకరించారు..

కాంగ్రెస్ ఎమ్మెల్యేల పనితీరుపై జనవరి ఒకటవ తేదీన సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు స్పందించారు. ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్‌రెడ్డి అనని మాటలను అన్నట్లుగా ప్రచారం జరిగిందన్నారు. నూతన సంవత్సరం భేటీ సందర్భంగా తాను కూడా అక్కడే ఉన్నట్లు చెప్పారు. ఆరోజు ముఖ్యమంత్రి ఎలాంటి రాజకీయ చర్చలు, వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. మీడియాలో తప్పుడు ప్రచారం జరిగిందన్నారు.