calender_icon.png 8 January, 2025 | 11:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు శంకుస్థాపన

12-10-2024 12:09:15 AM

రాష్ట్రవ్యాప్తంగా 28 చోట్ల భూమి పూజ

హాజరైన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు

విజయక్రాంతి నెట్‌వర్క్, అక్టోబర్ 11 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా 28 చోట్ల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు శుక్రవారం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం జింకలతండాలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నల్లగొండ జిల్లాకేంద్రం శివారులోని గంధవారిగూడెంలో రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ములుగు జిల్లా ఇంచర్ల గ్రామంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క, హనుమకొండ జిల్లాకేంద్రంలోని ఉర్సుగుట్టలో పర్యాటక, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, మహబూబ్‌నగర్ జిల్లా

బాలనగర్ మండలం పెద్దాయిపల్లి, సీసీ కుంట మండలం దమగ్నాపూర్‌లో రోడ్లు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కల్వకుంట్లలో ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి, సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తొండగ గ్రామంలో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం రెబ్బనపల్లిలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు, చెన్నూరు మండలం సోమనపల్లిలో గడ్డం వివేక్ వెంకటస్వామి, నాగర్‌కర్నూల్ జిల్లా తూడుకుర్తిలో  ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

మాది చేతల ప్రభుత్వం..

రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 

ఖమ్మం, అక్టోబర్ 11 (విజయక్రాంతి): తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని రాష్ట్ర రెవెన్యూ , సమాచార, పౌర సంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. విద్యా వైద్య రంగాలపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నదని, దీనిలో భాగంగానే రెండు రంగాల్లో సరికొత్త సంస్కరణలు ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు.

ఖమ్మం జిల్లా రూరల్ మండలం పొన్నెకల్‌లో శుక్రవారం ఆయన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి మాట్లాడారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ స్కూలు రావడం ఆనందాన్నిస్తోందన్నారు.

స్కూళ్లలో విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి వసతులు ఉంటాయన్నారు. కార్యక్రమంలో ఎంపీ రఘురాంరెడ్డి, కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ పాల్గొన్నారు.

మీ ఉడుత ఊపుళ్లకు భయపడం..

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క 

ఖమ్మం, అక్టోబర్ 11 (విజయక్రాంతి): భావిపౌరులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యాబోధన అందించాలనే లక్ష్యంతోనే రాష్ట్రప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్నదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఉద్ఘాటించారు.

ఖమ్మం జిల్లా బోనకల్ మండలం లక్ష్మీపురంలో శుక్రవారం ఆయన 25 ఎకరాల్లో నిర్మించ తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ స్కూల్  నిర్మాణానికి శంకుస్థాపన చేసి మాట్లాడారు. కులం, మతం అంతరాలు లేని నవ సమ సమాజ స్థాపనలో భాగంగానే స్కూళ్లు నిర్మిస్తున్నామన్నారు. తెలంగాణాను ప్రగతిశీల రాష్ట్రంగా తీర్చి దిద్దేందుకు, రేపటి తరం ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా విద్యావ్యవస్థలో సంస్కరణలు అమలు చేస్తామన్నారు.

ఇంటిగ్రేడెట్ స్కూళ్లలో సకల సౌకర్యాలు కల్పిస్తామన్నారు. గత ప్రభుత్వం ఈ తరహా స్కూళ్ల నిర్మాణానికి ఏడాదికి కేవలం రూ.73 కోట్లు మాత్రమే కేటాయించిందని గుర్తుచేశారు. కానీ, తమ ప్రభుత్వం సంవత్సరానికి రూ.5 వేల కోట్లు కేటాయించిందని కొనియాడారు. దసరాకు ముందే రాష్ట్రవ్యాప్తంగా 30 స్కూళ్లు నిర్మించాలని తలపెట్టామని, కానీ సాంకేతిక సమస్యల కారణంగా రెండు పెండింగ్ పడ్డాయని స్పష్టం చేశారు.

విద్యతోనే సమాజంలో అసమానతలు తొలగిపోతాయని తమ ప్రభుత్వం విశ్వసిస్తుందన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో విద్యార్థులు ఉమ్మడి కుటుంబంలా చదువుకుంటారన్నారు. తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా స్కూళ్లు నిర్మిస్తున్నామన్నారు.

ఇప్పటికే ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచితంగా విద్యుత్  సరఫరా అందిస్తున్నామని, విద్యాశాఖపై అనేకసార్లు సమీక్షలు సైతం నిర్వహించామన్నారు. కార్యక్రమానికి ఎంపీ రఘురాంరెడ్డి, వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్, కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్, డీసీసీబీ అధ్యక్షుడు దొండపాటి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. 

మరింత పనిచేస్తాం.. మార్పు తెస్తాం..

రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు 

మంథని, అక్టోబర్ ౧౧ (విజయక్రాంతి): రాష్ట్ర అభివృద్ధి కోసం మరింత పనిచేస్తామని, మార్పు తీసుకొస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. రాష్ట్రప్రభుత్వం విద్యావ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని, దీనిలో భాగంగానే విద్యాకమిషన్‌ను ఏర్పాటు చేసిందన్నారు.

ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి శుక్రవారం ఆయన పెద్దపెల్లి జిల్లా మంథని మండలం అడవి సోమనపల్లిలో ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి మాట్లాడారు. పేద విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్య అందించేందుకే అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూళ్లు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. ఈ స్కూళ్లలో కుల మతాలకు అతీతంగా విద్యాబోధన ఉంటుందన్నారు.

2026లోపు నిర్మాణాలు పూర్తి చేసి, ఆపై అడ్మిషన్స్ ప్రారంభిస్తామన్నారు. ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నదన్నారు. దీనిలో భాగంగానే  విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొస్తున్నదన్నారు. కార్యక్రమంలో సింగరేణి అధికారులు, యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో సకల వసతులు

రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి  పొన్నం ప్రభాకర్

కరీంనగర్/ హుస్నాబాద్, అక్టోబర్ 11 (విజయక్రాంతి): రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో విద్యార్థులకు సకల వసతులు ఉంటాయని రాష్ట్ర రవాణాశాఖ, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

శుక్రవారం ఆయన కరీంనగర్ మానకొండూరు మండలం తిమ్మాపూర్ మండలం యాదవులపల్లి, సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగళ్లపల్లిలో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి మాట్లాడారు. గత ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. దీంతో నిరుపేదలకు నాణ్యమైన విద్య దూరమైందన్నారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నదన్నారు. మొదటి దశలో రాష్ట్రవ్యాప్తంగా 28 స్కూళ్లు నిర్మిస్తామన్నారు. సిద్దిపేట జిల్లా తంగళ్లపల్లి  బద్దిబడగ వరకు బీటీ రోడ్డును విస్తరిస్తూ రెండు లైన్ల రహదారి నిర్మిస్తామన్నారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు.