- ‘మహారాష్ట్ర’ గెలుపుతో బీజేపీలో రెట్టించిన ఉత్సాహం
- వచ్చే ఏడాదిలో ఢిల్లీ, బీహార్ ఎన్నికలకు సన్నద్ధం
- 2026లో తమిళనాడు, కేరళ అసెంబ్లీ ఎన్నికలపై వ్యూహం
- దక్షిణ భారత్‌లో పాగాకు ‘కమల’నాథుల స్కెచ్
న్యూఢిల్లీ, నవంబర్ 23: అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్, మణిపూర్, ఒడిశా, రాజస్థాన్, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో బీజేపీ పాలన సాగుతున్నది. ఎన్డీఏ కూటమి భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, మేఘాలయ, నాగలాండ్, సిక్కింలో పాలన సాగుతున్నది.
ఎన్డీయే కూటమి గెలుపు పరంపరలో తాజాగా మహారాష్ట్ర కూడా చేరింది. ఇదే ఉత్సాహంతో బీజేపీ దక్షిణ భారతంలోనూ పాగా వేయాలని ఉవ్విళ్లూరుతున్నది. కానీ.. ప్రస్తుతం కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఎన్డీయే కూటమి పరిధిలో ఉన్నది. కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణపై ఇక బీజేపీ ప్రత్యేక దృష్టి సారించనున్నది.
మహారాష్ట్రలో ఘన విజయం..
శనివారం వెల్లడైన ఫలితాల్లో మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఏకంగా 132 సీట్లు దక్కించుకుని ‘మహాయుతి’ కూటమికి మేజర్ షేర్ ఇచ్చింది. అలాగే కూటమి పార్టీలైన శివసేన 57, ఎన్సీపీ 41 సీట్లు సాధించాయి. బీజేపీ అక్కడ ఎన్సీపీ, శివసేన సీట్లతో 145 మ్యాజిక్ ఫిగర్ దాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నది.
ఈ రాష్ట్రాల ఎన్నికలపై ప్రత్యేక దృష్టి..
ఢిల్లీలో 2024 ఫిబ్రవరితో రాష్ట్రప్రభుత్వ గడువు ముగియనున్నది. అలాగే ఇదే ఏడాది నవంబర్‌లో బీహార్‌లోనూ గడువు పూర్తి కానున్నది. దీంతో బీజేపీ రెండు రాష్ట్రాల ఎన్నికలపై దృష్టి సారిస్తున్నది. ఢిల్లీని ప్రస్తుతం ‘ఆప్’ పాలిస్తుండగా, బీహార్‌లో ఎన్టీఏ కూటమి ప్రభుత్వమే పాలన సాగిస్తున్నది. రెండు రాష్ట్రాల్లోనూ ఈసారి ఎక్కువ సీట్లు సాధించి పాలన పగ్గాలు చేపట్టాలనే ఉత్సాహంతో బీజేపీ ప్రణాళికలు రచిస్తున్నది.
కేరళ, తమిళనాడు ఎన్నికల పైనా..
2026లో అసోం, కేరళ, తమిళనాడు ఎన్నికలు ఉన్నాయి. అసోంలో పాగాకు బీజేపీకి పెద్ద కష్టపడనక్కర్లేదు. కానీ, ద్రవిడ ఉద్యమం బలంగా ఉన్న తమిళనాడులో పార్టీ ఎదగలేకపోతున్నది. రాష్ట్రవ్యాప్తంగా 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా, బీజేపీ 2021 ఎన్నికల్లో కేవలం 4 ఎమ్మెల్యే సీట్లు సాధించగలిగింది. కేరళలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాలు ఉండగా, బీజేపీ ఖాతా అయినా తెరవలేదు.
జార్ఖండ్‌లో అంతంతమాత్రం సీట్లు..
ఎన్నికల సందర్భంగా బీజేపీ జార్ఖండ్‌లో జనతాదళ్, ఏజేఎస్‌యూపీ, జేడీయూ, ఎల్‌జేపీ (రాంవిలాస్)తో జట్టుకట్టింది. శనివారం విడుదలైన ఎన్నికల ఫలితాల్లో బీజేపీ స్వయంగా 21 స్థానాల్లో విజయ ఢంకా మోగించింది. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 41. కానీ, బీజేపీ సాధించిన స్థానాలు, కూటమిలో భాగమైన జనతాదళ్, ఏజేఎస్‌యూపీ, జేడీయూ, ఎల్‌జేపీ (రామ్‌విలాస్) పార్టీలు ఒక్కో పార్టీ ఒక్కో సీటు చొప్పున నాలుగు సీట్లే దక్కించుకున్నాయి. అంటే.. కూటమి మొత్తం కలిపి 24 సీట్లు సాధించినట్లు లెక్క.