calender_icon.png 4 January, 2025 | 4:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫార్ములా ఈ.. లొట్టపీసు కేసు

02-01-2025 12:52:07 AM

  1. ఈ-రేస్ మొట్టమొదటి అవినీతి లేని కేసు
  2. సీఎం రేవంత్‌రెడ్డి బలవంతంగా కేసు పెట్టించారు..
  3. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ 
  4. తెలంగాణ భవన్‌లో మీడియా ఇష్ఠాగోష్ఠిలో వ్యాఖ్యలు

హైదరాబాద్, జనవరి 1 (విజయక్రాంతి): ‘ఫార్ములా ఈ--రేస్ కేసు లొట్టపీసు కేసు. అవినీతి నిరోధక శాఖ నమోదు చేసిన మొట్టమొదటి అవినీతి లేని కేసు. ఏడాది నుంచి సీఎం రేవంత్‌రెడ్డి వ్యక్తిగతంగా ఫాలోఅప్ చేస్తూ, బలవంతంగా నాపై కేసు పెట్టించారు’ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అని ఆరోపించారు.

ఏసీబీ కేసు, ఈడీ నోటీసులను న్యాయం పరంగా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బుధవారం నిర్వహించిన ఇష్ఠాగోష్ఠిలో మీడియా అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. తనకు ఇప్పటికే ఈడీ నోటీసులు ఇచ్చిందని, వాటిపై తాము న్యాయపోరాటం చేస్తున్నామన్నారు.

హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో వేచి చూడాల్సి ఉందన్నారు. హైకోర్టు న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు ఏజీ దగ్గర సమాధానాలే లేవని ఎద్దేవా చేశారు. ఏదో ఒక రకంగా తనను జైలుకు పంపాలని రాష్ట్రప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. ఈతూ నాడు మున్సిపల్ శాఖ మంత్రిగా తాను అనుమతులు ఇచ్చానని స్పష్టం చేశారు. 

బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ గూటికి చేరిన ఎమ్మెల్యేల అంశాన్ని మీడియా ప్రశ్నించగా.. ‘ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై మేం సుప్రీంకోర్టుకు వెళ్తాం’ అని సమాధానమిచ్చారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను చూస్తుంటే ఎప్పుడైనా ఉప ఎన్నికలు రావొచ్చని జోస్యం చెప్పారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచకుండా రాష్ట్రప్రభుత్వం మోసం చేస్తున్నదని మండిపడ్డారు.

రైతు భరోసా అందకపోవడంతో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నదన్నారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు ప్రజల మధ్యకు ఎప్పుడు రావాలో తెలుసునన్నారు. ఆ విషయాన్ని కాంగ్రెస్ నేతలు పదే పదే చెప్పాల్సిన అవసరం లేదని    మండిపడ్డారు. 

ఏప్రిల్ 27న బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని, దీనిలో భాగంగానే భారీ బహిరంగసభ నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లోనే పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీ కమిటీలను నియమిస్తామన్నారు.

రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్ట్‌లో రూ. 12 వేల కోట్ల కుంభకోణం జరగబోతుందన్నారు. రాజధానిలోని ఖాజాగూడ భూములపై కన్నేసిన ప్రభుత్వ పెద్దలు పేదలను రోడ్డుపాలు చేశారని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రూ.1.38 లక్షల కోట్లు అప్పులు చేసి ఢిల్లీ పెద్దలకు మూటలు పంపుతున్నారని ఆరోపించారు.

ప్రభుత్వంతో ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు నెరపుతున్న సంబంధాలపై మీడియా ప్రశ్నించగా..‘ దిల్ రాజు నిర్మాతగా సంక్రాంతికి రెండు సినిమాలు ఉన్నాయి. ఆయన బాధలేవో ఆయన పడుతున్నారు’ అంటూ ఫన్నీ వ్యాఖ్యలు చేశారు.

అక్టోబర్‌లో బీఆర్‌ఎస్ అధ్యక్ష పదవికి ఎన్నిక.. 

బీఆర్‌ఎస్ అధ్యక్ష పదవికి అక్టోబర్‌లో ఎన్నిక ఉంటుందని, కేసీఆర్‌తో పాటు తనను కూడా పార్టీ అధ్యక్షుడిగా ప్రతిపాదనలు పెడతానని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీ రాష్ట్ర కమిటీలో అన్ని వర్గాల నేతలకు అవకాశం కల్పిస్తామని, పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే వారికే ప్రాధాన్యత ఉంటుందన్నారు.

అలాగే పలు నియోజకవర్గాలకు బాధ్యులను కూడా నియమిస్తామన్నారు. తమ పార్టీలో ఎవరూ అసంతృప్తిగా లేరని తెలిపారు. ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా తెలంగాణ భవన్‌కు వస్తున్నారని, ఆ విషయాన్ని తాము గర్వంగా చెప్పుకొంటామని స్పష్టం చేశారు.