calender_icon.png 14 February, 2025 | 4:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని అరెస్ట్

14-02-2025 01:20:47 AM

శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పడమట పోలీసులు గురువారం హైదరాబాద్‌లోని రాయదుర్గంలో అరెస్ట్ చేశారు. వల్లభనేని వంశీపై కిడ్నాప్, బెదిరింపులు సహా మొత్తం 7 కేసులు ఉన్నాయి. గతంలో టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులోనూ నిందితుడిగా ఉన్న వల్లభనేని వంశీ ఆ కేసులో బెయిల్ పొందారు.

తాజాగా సత్యవర్ధన్ అనే వ్యక్తిపై దాడి, బెదిరింపులు, కిడ్నాప్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో మొత్తం 88 మంది ఉండగా వల్లభనేని వంశీ మోహన్ ఏ 71గా ఉన్నారు. వైసీపీ నేత వల్లభనేని వంశీపై బీఎన్‌ఎస్ సెక్షన్ 140(1), 308, 351(3), రెడ్ విత్ 3(5) కింద కేసులు, అలాగే విజయవాడ పడమట పోలీస్ స్టేషన్‌లో వంశీపై సెక్షన్ 3(1), 3(2) ఆఫ్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసులు ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆయన్ను విజయవాడ తరలించారు. సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి, బెదిరింపులకు పాల్పడిన కేసులో వంశీని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిపై కేసు సత్యవర్ధన్ ఫిర్యాదు నమోదు చేశారు. సత్యవర్ధన్ ఆ ఫిర్యాదును కోర్టులో వెనక్కి తీసుకున్నారు. పోలీసులు విచారణ చేపట్టగా వల్లభనేని వంశీ, అతడి అనుచరులు తనను కిడ్నాప్ చేసి, బెదిరింపులకు పాల్పడి వెనక్కి తీసుకునేలా చేశారని సత్యవర్ధన్ వెల్లడించారు.