ఖమ్మం,(విజయక్రాంతి): ఎన్టీఆర్ ఎప్పుడూ ప్రజల మదిలోనే.. ప్రజల మధ్యలోనే ఉంటారని, ఆయనకు భారత రత్న ఇవ్వాలని మాజీ కేంద్ర మంత్రి రేణుకాచౌదరి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. ఖమ్మంలోని ఎన్టీఆర్ సర్కిల్‌లో ఎన్టీఆర్ వర్ధంతి సందర్బంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి, ఆయన సేవలను కొనియాడారు. స్వచ్చమైన పాలన అందించి, అందర్నీ ఒక తాటి మీదకు తీసుకువచ్చిన గొప్ప నాయకుడని రేణుకాచౌదరి కొనియాడారు. రాజకీయ విభేదాలు లేకుండా ఐక్యతతో పని చేశారన్నారు. ఆయన్ని స్మరించుకోవడం అదృష్టమన్నారు.
రాజకీయాల్లో 9 నెలల్లో పార్టీ పెట్టి, అధికారంలోకి వచ్చిన నాయకుడన్నారు. జాతీయ స్ధాయిలో నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి, అందర్నీ ఐక్యం చేశారని,ఆయన చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని, వారి వల్లనే తన రాజకీయ ప్రవేశంజరిగిందని, తనను అన్ని విధాలా ప్రోత్సహించారని అన్నారు. ఒక పార్టీకి చెందిన నాయకుడు కాదని, అందరు స్మరించుకోవాల్సిన నాయకుడని, నిస్వార్ధ సేవ చేశారని అన్నారు. ఆయన స్పూర్తితో అందరం కలసికట్టుగా ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, డాక్టర్ వాసిరెడ్డి రామనాధం, పువ్వాళ్ల దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.