calender_icon.png 23 December, 2024 | 12:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీలంక మాజీ క్రికెటర్ దారుణ హత్య

18-07-2024 12:05:00 AM

కొలంబో: శ్రీలంక మాజీ క్రికెటర్ ధామిక నిరోషన దారుణ హత్యకు గురయ్యాడు. తన నివాసంలో భార్యా బిడ్డల ఎదుటే నిరోషనను దుండగులు అతి కిరాతకంగా కాల్చి చంపారు. మంగళవారం రాత్రి ఈ దుర్ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. గాలె జిల్లాలోని అంబాలన్ గోడా ప్రాంతంలో నివాసముంటున్న ధామిక నిరోషన ఇంట్లోకి మంగళవారం రాత్రి ఒక వ్యక్తి చొరబడ్డాడు. మాజీ క్రికెటర్‌పై దాడికి దిగిన దుండగుడు తనతో తెచ్చిన తుపాకీతో కాల్పులు జరిపాడు. పాయింట్ బ్లాక్‌లో కాల్పులు జరపడంతో నిరోషన అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అతడిని హతమార్చడం వెనుక కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. కుడిచేతి వాటం ఫాస్ట్ బౌలర్ అయిన ధామిక 2000 సంవత్సరంలో శ్రీలంక అండర్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 12 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లతో పాటు 8 లిస్ట్ మ్యాచ్‌ల్లో లంకకు ప్రాతినిధ్యం వహించాడు. వ్యక్తిగత కారణాలతో 20 ఏళ్లకే క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. కాగా ధామిక నిరోషన మృతి పట్ల లంక మాజీ క్రికెటర్లు సంతాపం ప్రకటించారు.