అధికారులు సర్వే చేసి చెప్పినా మారని వైనం...
గజ్వేల్ (విజయక్రాంతి): మల్లన్న సాగర్ లో తమ ఆస్తులు కోల్పోయి ఆర్ అండ్ ఆర్ కాలనీలో నివాసముంటున్న సింగారం గ్రామస్తులకు మాజీ సర్పంచ్ నుండి ఇబ్బందులు తప్పడం లేదు. ఆర్ అండ్ ఆర్ కాలనీలోని సింగారం గ్రామంలో రోడ్డును కబ్జా చేసి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారంటూ గ్రామ ప్రజలు ఆరోపించారు. బుధవారం గ్రామస్తులు విలేకరులతో మాట్లాడుతూ.. మాజీ సర్పంచ్ కర్రే లక్ష్మి భర్త రాజయ్య ప్రభుత్వం ఇచ్చిన 250 గజాల స్థలాన్ని కంటే ఎక్కువ భూమిని కబ్జా చేసి ఇల్లు నిర్మించారని ఆరోపించారు. ప్రధాన రహదారి నుండి గ్రామంలోకి వెళ్లే రహదారినీ కబ్జా చేసి ఇల్లు నిర్మించడంతో రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందన్నారు. గత ఏడాది కాలంగా అధికారులకు వరుసగా ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోలేదని, పలుమార్లు జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో కూడా ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు సమస్యను గుర్తించి కబ్జాకు గురైన రోడ్డును రాకపోకలకు అణువుగా మార్చాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు రాములు, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు రాజు, గ్రామస్తులు నవీన్ కుమార్, స్వామి, శివయ్య, పెంటయ్య, శ్రీను, అశోక్, రాజు తదితరులు పాల్గొన్నారు.