కామారెడ్డి,(విజయక్రాంతి): ఆర్టీసీ బస్సు ఢీకొని మాజీ సర్పంచ్ భర్త మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలాఉన్నాయి. మాచారెడ్డి మండలం చుక్కాపూర్ గ్రామానికి చెందిన ఓడపల్లి నర్సింగరావు( 53) బైకు పై చుక్కాపూర్ నుంచి మాచారెడ్డి క్రాస్ రోడ్డు పోతుండగా తన కూతురును మరొక అబ్బాయిని వెంటబెట్టుకొని బైక్ పై వెళుతుండగా ఎదురుగా వస్తున్న ఆర్టిసి బస్సు ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి.
చికిత్స నిమిత్తం తరలిస్తుండగా మృతి చెందినట్లు మాచారెడ్డి ఎస్ఐ అనిల్ కుమార్ తెలిపారు. మాచారెడ్డి బస్టాండ్ వద్ద బస్టాండ్ నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు రోడ్డు ఎక్కుతున్న సమయంలో నర్సింగ్ రావు తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండడంతో ఆర్టీసీ డ్రైవర్ బస్సు ఆపి మళ్లీ ప్రారంభించడంతో నర్సింగ్ రావు కూడా తన వాహనాన్ని ఆపి మళ్ళీ ప్రారంభించడంతో ద్విచక్ర వాహనాన్ని ఆర్టిసి బస్సు ఢీ కొట్టింది. నర్సింగ్ రావు కూతురుకు మరో అబ్బాయికి స్వల్ప గాయాలు అయ్యాయి.
గాయపడిన నర్సింగ్ రావు ను చికిత్స నిమిత్తం కామారెడ్డికి తరలిస్తుండగా మృతి చెందారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. నర్సింగరావు అకాల మరణంతో చుక్కాపూర్ గ్రామంలో విషాద ఛాయలు అమ్ముకున్నాయి. సోమవారం నర్సింగ్ రావు అంత్యక్రియలను గ్రామంలో నిర్వహించారు. మృతునికి భార్య ఒక కూతురు ఒక కుమారుడు ఉన్నారు.