తీవ్ర అస్వస్థతో ఎయిమ్స్‌లో చేరిన మన్మోహన్ సింగ్
శ్వాసకోశ సమస్యలతో చికిత్స పొందుతూ మృతి
సోషల్ మీడియా వేదికగా మరణ వార్తను ప్రకటించిన రాబర్ట్ వాద్రా
అత్యంత విశిష్టనేతల్లో మన్మోహన్ ఒకరు: మోదీ
మన్మోహన్ ఒక లెజెండ్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
న్యూఢిల్లీ,(విజయక్రాంతి): మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. ఆయన గురువారం సాయంత్రం తీవ్ర అస్వస్థకు గురికావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. ఎమర్జెన్సీ విభాగంలో చికిత్స అందిస్తుండగా ఆయన తుదిశ్వాస విడిచినట్టు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు రావడంతో ఆయనను ఆసుపత్రిలో చేర్పించినట్టు సమాచారం. మన్మోహన్ సింగ్‌కు భార్య గురుశరణ్ కౌర్, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మన్మోహన్ సింగ్ 2004 పదేళ్లపాటు ప్రధానిగా సేవలందించారు. ఆయన హయాంలో జీడీపీ వృద్ధి రేటు పెరిగింది. మాజీ ప్రధాని పీవీ నరసింహరావు హయాంలో ఆయన ఆర్థిక మంత్రిగా పని చేశారు. ఈ సందర్భంగా దేశ అభివృద్ధి కోసం ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు.