calender_icon.png 8 November, 2024 | 4:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ మృతి

30-06-2024 12:51:09 AM

ప్రజా నాయకుడిగా గుర్తింపు

జెడ్పీటీసీ నుంచి ఎంపీగా ఎదిగిన రాథోడ్

సీఎం, కేంద్ర మంత్రుల సంతాపం

ఆదిలాబాద్, జూన్ 29 (విజయక్రాంతి): ఆదిలాబాద్ మాజీ ఎంపీ, మాజీ జడ్పీ చైర్మన్ రమేశ్ రాథోడ్(59) శనివారం మృతిచెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రమేశ్ రాథోడ్ ఉట్నూర్‌లోని తన సగృహంలో శుక్రవారం అర్ధరాత్రి అసస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో ఇచ్చోడ వద్ద తుది శాస విడిచారు. ఆయన భౌతికకాయాన్ని ఉట్నూర్‌లోని ఆయన సగృహానికి తరలించారు. రమేశ్ రాథోడ్ మృతితో జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వేలాదిగా పార్టీ శ్రేణులు, అభిమానులు తరలివచ్చారు. ఆదివారం ఉదయం ఉట్నూర్ ఎక్స్ రోడ్ వద్ద ఆయన వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిరహించనున్నారు. 

కుటుంబ నేపథ్యం

ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని తాడిహత్నూర్ గ్రామానికి చెందిన లంబాడీ గిరిజన దంపతులైన మోహన్ రాథోడ్, కమలబాయ్‌లకు 20 అక్టోబరు 1966లో రమేశ్ రాథోడ్ జన్మించారు. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన రమేశ్ రాథోడ్ ప్రాథమిక విద్యను స్థానిక జిల్లా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో గురువు లక్ష్మీకాంతం వద్ద చదువుకున్నాడు. ఉట్నూర్‌లోని ప్రభుత జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసి, ప్రభుత డిగ్రీ కళాశాల ఆదిలాబాద్‌లో బీఏలో డిగ్రీ చదివారు. రమేష్ రాథోడ్‌కు మహారాష్ర్టకు చెందిన సుమన్ బాయితో వివాహమైంది. సుమన్ బాయ్ సైతం ఖానాపూర్ ఎమ్మెల్యేగా పనిచేశారు. వీరికి కూతురు సోనాలి, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కొడుకు రితేష్ రాథోడ్ బీటెక్ చదివి తండ్రి వారసుడిగా ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నారు. చిన్న కొడుకు రాహుల్‌రాథోడ్ ఎంబీబీఎస్ పూర్తి చేశారు. యూపీఎస్సీ అఖిల భారతీయ సరీస్‌లో ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎంపికైన తొలి లంబాడీ గిరిజన యువకుడు. ఇతను న్యూ ఢిల్లీలో అదనపు కలెక్టర్‌గా విధులు నిరర్తిస్తున్నారు.

రాజకీయ ప్రస్థానం

రమేశ్ రాథోడ్ రాజకీయ ప్రస్థానం తెలుగు దేశం పార్టీలో మొదలయ్యింది. అప్పటి కేంద్ర మంత్రి వేణుగోపాలచారి ప్రోద్బలంతో రాజకీయాల్లోకి వచ్చారు. జెడ్పీటీసీగా మొదలైన రమేశ్ రాథోడ్ రాజకీయ ప్రస్థానం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎంపీ స్థాయి వరకు కొనసాగింది. టీడీపీ నుండి ఖానాపూర్ ఎమ్మెలగా 1999 వరకు  పనిచేశారు. 2006 వరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జెడ్పీ చైర్మన్‌గా పని చేశారు. 2009 వరకు ఆదిలాబాద్ ఎంపీగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరారు. కొంతకాలానికే టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ నుండి ఖానాపూర్ ఎమ్మెల్యేగా, ఆదిలాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరాత 2021 బీజేపీలో చేరారు. 2023లో ఖానాపూర్ ఎమ్మెల్యేగా బీజేపీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మ బొజ్జు చేతిలో ఓడిపోయారు. 

సీఎం, కేంద్ర మంత్రులు, ప్రముఖుల సంతాపం

రమేశ్ రాథోడ్ మృతితో రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు. సీఎం రేవంత్‌రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబుతోపాటు కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీలు ఈటల రాజేందర్,  గోడం నగేష్ సంతాపం తెలిపారు. రాథోడ్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఆదిలాబాద్ జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్, ఖానాపూర్, బోథ్  ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, అనిల్ జాదవ్ ఉట్నూర్‌లోని ఆయన సగృహానికి వెళ్లి భౌతికాయానికి నివాళులర్పించారు. బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే మహేశర్‌రెడ్డి,  కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలచారి, మాజీ మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి, నిర్మల్ జడ్పీ చైర్‌పర్సన్ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, రామరావు పటేల్, కోవలక్ష్మి, హరీశ్‌బాబు, మాజీ ఎమ్మెల్యే విట్టల్‌రెడ్డి, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ శోభ సత్యనారాయణగౌడ్, లోలం శ్యామ్‌సుందర్ సంతాపాన్ని ప్రకటించారు. 

ఉమ్మడి ఆదిలాబాద్‌లో చెరగని ముద్ర

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో రమేష్ రాథోడ్‌ది చెరగని ముద్ర. జెడ్పీటీసీ  నుంచి జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే, ఎంపీగా ప్రజలకు అనేక సేవలందించారు. ప్రజా నాయకుడిగా పేరుగాంచిన రమేష్ రాథోడ్ పదవిలో ఉన్న లేకున్నా ఎల్లవేళలా ప్రజల మధ్యనే ఉండేవారు. ప్రజా ప్రతినిధిగా కొనసాగిన సమయంలో ముక్కు సూటిగా వ్యవహరిస్తూ కొన్ని సందర్భాల్లో  అధికారులను గడగడలాడించారు.