calender_icon.png 13 April, 2025 | 4:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్‌ఎల్డీలోకి మాజీ ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్

13-04-2025 01:00:29 AM

  1. ఢిల్లీలో ఆ పార్టీ అధ్యక్షుడు జయంత్‌చౌదరి సమక్షంలో చేరిక
  2. తెలంగాణ, మహారాష్ట్ర ఇన్‌చార్జ్‌గా నియామకం
  3. విశేష అనుభవమున్న నేత కావడంతో రాష్ట్రంలో పార్టీ అభివృద్ధికి దోహదం

హైదరాబాద్, ఏప్రిల్ 12 (విజయక్రాంతి): రాష్ర్టంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మాజీ ఎమ్మెల్సీ కపిలివాయి దిలీప్‌కుమార్ రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీ (ఆర్‌ఎల్డీ)లో చేరారు. శనివారం ఢిల్లీలో ఆర్‌ఎల్డీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జయంత్‌చౌదరి సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు.

వెంటనే దిలీప్‌కుమార్‌ను రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీ తెలంగాణ, మహారాష్ర్ట ఇన్‌చార్జ్‌గా నియమిస్తున్నట్లు జయంత్‌చౌదరి ప్రకటించారు. 2023 అక్టోబర్ 27న అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో ఆ పార్టీలో చేరారు.

అయితే ఆయనకు పార్టీలో తగిన గుర్తింపు దక్కకపోవడంతోనే కాంగ్రెస్‌ను వీడినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఎంతో అనుభవమున్న దిలీప్‌కుమార్ తెలంగాణలో పార్టీని అభివృద్ధి చేస్తారని ఆర్‌ఎల్డీ భావిస్తోంది. 

వ్యక్తిగత కార్యదర్శి నుంచి ఎమ్మెల్సీ వరకు..

దివంగత హోంమంత్రి మాధవరెడ్డి వద్ద, ఆయన మరణించిన తర్వాత ఉమామాధవరెడ్డి వద్ద పీఎస్‌గా దిలీప్‌కుమార్ పనిచేశారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పీఎస్‌గానూ పనిచేశారు. నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ తరుపున రెండుసార్లు ఎమ్మెల్సీగా గెలిచారు.

2009లో ఆ పార్టీ నుంచి విడిపోయి వీ ప్రకాశ్, బెల్లయ్యనాయక్‌తో కలిసి తెలంగాణ రాష్ర్ట సాధన కోసం 2009 జూన్ 18న తెలంగాణ విమోచన సమితి (టీవీఎస్)ని ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన విమలక్క, గద్దర్‌లాంటి వారితో కలిసి టీయూఎఫ్‌ను ప్రారంభించి 2014 ఎన్నికల్లో అజిత్‌సింగ్ నేతృత్వంలోని టీఆర్‌ఎల్‌డీలో చేరారు. తర్వాత టీజేఎస్, బీజేపీల్లో కూడా దిలీప్‌కుమార్ పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు.