24-02-2025 03:25:26 PM
కాగజ్ నగర్,(విజయక్రాంతి): మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పను సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు బిజెపి పార్టీలోకి ఆహ్వానించారు. సోమవారం తన నివాసంలో ఎన్నికల ఇంచార్జ్ నరేందర్ రెడ్డి, సీనియర్ నాయకుడు అరిగెల నాగేశ్వరరావుతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోనేరు కోనప్ప పరిస్థితి కాంగ్రెస్ పొమ్మంటుంది, టిఆర్ఎస్ వద్దంటుందని బిజెపి ఆహ్వానిస్తుందని అన్నారు. ఆయన అనుభవానికి, వయసుకు సముచిత గౌరవం కల్పిస్తామని తెలిపారు.
పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని కోరారు. సిర్పూర్ నియోజకవర్గంలో అతిథి నాయకులు పర్యటనలు చేస్తూ విమర్శలు చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి ,రైతు సంక్షేమం కోసం కృషి చేస్తుందని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ప్రశ్నించే గొంతుకలను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షురాలు లావణ్య నాయకులు శంకర్ ,సత్యనారాయణ, అశోక్ తదితరులు పాల్గొన్నారు.