calender_icon.png 10 January, 2025 | 9:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్యే వినోద్ పై అనుచిత వ్యాఖ్యలు చేయలేదు

10-01-2025 05:24:59 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్(MLA Gaddam Vinod) పై ఎక్కడా అనుచిత వ్యాఖ్యలు చేయలేదని బీఆర్ఎస్ బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు నూలేటి సత్యనారాయణ అన్నారు. శుక్రవారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సింగరేణి క్వార్టర్లకు విద్యుత్ కనెక్షన్లు తొలగిస్తున్నారని తెలిసి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కార్మిక కాలనీలను సందర్శించి అక్కడి సమస్యను ఎమ్మెల్యే వినోద్ దృష్టికి తీసుకువచ్చి తాత్కాలిక పరిష్కారాన్ని చూపారన్నారు. దీనిని కాంగ్రెస్ నాయకులు కొండంతగా చూపి గురువారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య, ఎమ్మెల్యే వినోద్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు చేయడం సరైంది కాదని అన్నారు.

ఎమ్మెల్యే వినోద్ నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని మాత్రమే చిన్నయ్య విమర్శించారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సింగరేణి సి అండ్ ఎండి తో మాట్లాడి బెల్లంపల్లి పట్టణంలో 7వేల కు పైగా కార్మికులు నివసించే క్వార్టర్లకు పట్టాలను అందజేశారన్నారు. ఎమ్మెల్యే వినోద్ కు కార్మిక కుటుంబాలపై  ప్రేమ ఉంటే మిగిలిపోయిన మరో మూడు వేల మందికి పట్టాలను అందించాలని సూచించారు. కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే వినోద్ దగ్గర మంచి పేరు సంపాదించాలనే ఉద్దేశంతో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అబద్ధపు ప్రచారాలకు తీరలేపుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే వినోధ్ సింగరేణి సి అండ్ ఎండి తో చర్చించి 11 కార్మిక కాలనీలో విద్యుత్ సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే గా గెలిచిన వినోద్ అభివృద్ధి పేరుతో ప్రజలను మభ్యపెట్టి కాలయాపన చేస్తున్నారని విమర్శించారు.

గత ప్రభుత్వం పట్టణ ప్రగతి పేరుతో మంజూరు చేసిన రూ.23 కోట్ల నిధులతో ప్రారంభోత్సవాలు చేస్తూ ఆర్భాటాలు చేస్తున్నారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హయాంలోనే బెల్లంపల్లిలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం జరిగిందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. బెల్లంపల్లికి మంజూరైన బస్ డిపోను తీసుకువచ్చేందుకు ఎమ్మెల్యే వినోద్ కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గతంలో మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య సహకారంతో బి ఫామ్ పొంది ఓడిపోవడం నిజం కాదా అని ప్రశ్నించారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు భార్య  ప్రస్తుతం మునిసిపల్ కోఆప్షన్ సభ్యురాలుగా కొనసాగుతుందని, ఆమె బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలో దేని నుండి కొనసాగుతుందో స్పష్టం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బి ఆర్ ఎస్ నాయకులు తాళ్లపల్లి మల్లయ్య, సుందర్ రావు, సాజిద్ వాజిద్, సబ్బని అరుణ్ కుమార్, అలీ భాయ్, గోపి, కాంపల్లి రాజం, లింగంపల్లి రాములు, అచ్చ సత్యనారాయణ, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.