మహబూబ్ నగర్,(విజయక్రాంతి): మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా చెప్పండి.. జిల్లా కలెక్టర్, చీఫ్ సెక్రటరీ, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా.. వారు చేయకుంటే మేము ఆ పనులను పూర్తి చేస్తామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విద్యార్థినులకు భరస కల్పించారు. శనివారం బాలికల బాత్రూంలలో ఫోన్ కెమెరాలను పెట్టిన విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కావడంతో ఆదివారం పాలిటెక్ కళాశాలలోని విద్యార్థినిలను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కలిశారు. ఈ సందర్భంగా వారికి బాత్రూంలో తో పాటు ఇతర సమస్యలు ఏమైనా ఉన్నా వెంటనే పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న చర్యలతో ఆడపిల్లలను కన్నెత్తి చూడాలంటే.. వేదించాలంటే భయపడే పరిస్థితి ఉండేదన్నారు. రాష్టంలో ఇటీవల మల్లి ఆడపిల్లలపై వేధింపులు పెరుగుతున్నాయని, పాలీటెక్నిక్ కళాశాలలో ఆకతాయి బాత్రూంలో ఫోన్ పెట్టి వీడియో రికార్డు చేస్తూ ఏమి తెలియనట్టు బుకాయించడం ఆశ్చర్యం కలిగించిందని చెప్పారు, ఇతడిని కఠినంగా శిక్షించాలని, ఇలాంటి ఘటనలు ఏ కళాశాలలో, పాఠశాలలో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యాలయాల్లో విద్యార్థినిలకు పూర్తి స్థాయి వసతులతో మూత్రశాలలు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థినిలు ఏ సమస్యలు వచ్చిన ఉపాధ్యాయులకు చెప్పుకునేవిధంగా కళాశాలల్లో వాతావరణం కల్పించాలని సూచించారు.
పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థినీలతో సమావేశాలు ఏర్పాటు చేసి వారి సమస్యలు, వారికి కావాల్సిన సౌకర్యాల గురించి అధికారులు అడిగి తెలుసుకోవాలని కోరారు. మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ కోసం ప్రత్యేక సెంటర్ నిర్మాణం కు శంకుస్థాపన చేసుకున్నాం..రూ. 25 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు తీసుకువచ్చామని, పూర్తి అయితే విద్యార్థినిలు నైపుణ్యం పెంచుకునేందుకు అవకాశం ఉందని అన్నారు. విద్యార్థినిలకు ఎలాంటి సమస్యలు ఉన్న వెంటనే ఉపాధ్యాయులకు చెప్పాలని, అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఆకతాయిల బెదిరింపులకు బయడవద్దని ధైర్యంగా వారిని ఎదుర్కోవాలని సూచించారు. మాజీ మంత్రి తో పాటు చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆంజనేయులు, పార్టీ పట్టణ అధ్యక్షులు శివరాజ్ తదితరులు ఉన్నారు.