21-04-2025 11:57:53 PM
దుబాయ్ ఎన్ఆర్ఐ ప్రతినిధులతో మాట్లాడిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): హన్వాడ మండలం పెద్దదర్పల్లి గ్రామానికి చెందిన మ్యాతరి గోపాల్ దుబాయిలో చిక్కుకున్న తెలుసుకున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక దృష్టి సారించారు. పెద్దదర్పల్లికి చెందిన గోపాల్ ను తిరిగి స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు అధికారులతో పాటు దుబాయ్ ఎన్ఆర్ఐ ప్రతినిధులతో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫోన్ ద్వారా మాట్లాడారు. గోపాల్ ను తిరిగి తీసుకువచ్చేందుకు వేగంగా చర్యలు తీసుకోవాలని జీఏడీ ప్రిన్సిపాల్ కార్యదర్శి రఘునందన్ రావును కోరారు. కుటుంబం ఆర్ధిక పరిస్థితి సరిగ్గా లేదని, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. అనంతరం దుబాయ్ ఎన్ఆర్ఐ అసోసియేషన్ అధ్యక్షులు ఇఫ్తాకేర్ అహ్మద్ తో మాట్లాడారు.
గోపాల్ ని తిరిగి తీసుకువచ్చేందుకు అవసరమైన సహకారం ఇవ్వాలని ఇఫ్తాకర్ అహ్మద్ ని కోరారు. వెంటనే బాధితుడిని సంప్రదిస్తామని, అతని సమస్య తెలుసుకొని పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. ఆర్ధికంగా అవసరం అయితే అసోసియేషన్ నుంచి సహకారం ఇస్తామని అన్నారు. తిరిగి స్వగ్రామానికి పంపించేందుకు పూర్తి సహకారం ఇస్తామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కి ఇఫ్తాకర్ అహ్మద్ తెలిపినట్లు మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలియజేశారు. కుటుంబ సభ్యులు ఆందోళన చెందకూడదని గోపాలన ఎట్టి పరిస్థితుల్లో తిరిగి స్వగ్రామానికి స్వేచ్ఛగా తీసుకువస్తామని మంత్రి తెలిపారు.