21-02-2025 02:01:41 PM
ఉమ్మడి రాష్ట్రములో ఆంధ్ర కు నీళ్లు పోతుంటే ప్రశ్నించే నాయకుడు ఒక్కరు లేరు
నది జలాల వాటా తేల్చకుండా 10 ఏండ్లుగా కేంద్రం నానబెట్టింది
నది జలాల వాటా చేయాలనీ కేంద్ర మంత్రులు ఎందుకు మౌనంగా ఉన్నారు
మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
వనపర్తి,(విజయక్రాంతి): రాష్ట్రంలో ఉన్న సాగు నీటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Irrigation Minister Uttam Kumar Reddy) సాగు నీటి విషయంలో జరుగుతున్న అన్యాయంపై మాట్లాడకుండా ఉత్తి మాటలు మాట్లాడుతున్నారని, తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం సాగు నీటి అన్యాయంపై మాట్లాడాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(Former Minister Singireddy Niranjan Reddy) హితువు పలికారు. శుక్రవారం జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి మాట్లాడుతూ... ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి విషయంలో తెలంగాణకు తీరని అన్యాయం చేశారని, ప్రాజెక్టులను మొదలు పెట్టి పూర్తి చేయకుండా కేవలం ఆంధ్రలో మాత్రం ప్రాజెక్టులను పూర్తి చేసుకున్నారన్నారు.
సాగునీటి విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని, అప్పటి ఉద్యమ నాయకుడు, మాజీ సిఎం కెసిఆర్ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసి గ్రామ గ్రామాన తిరిగి అందరిని ఏకం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుని రావడం జరిగిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెండింగ్ ప్రాజెక్టులన్నిటిని పూర్తి చేయడంతో పాటు కాళేశ్వరం నిర్మించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులను చివరి దశ వరకు చేయడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. వందల టీఎంసీల నీళ్లు నిల్వ చేసుకునేలా ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రాలో నిర్మిస్తుంటే తెలంగాణలో ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఉన్న నాయకులు కండ్లు అప్పగించి చూస్తూ తమ పదవులు ఎక్కడ పోతావో అని మౌనంగా ఉన్నారే తప్ప ఒక్కరు కూడా ప్రశ్నించిన దాఖలాలు లేవన్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు అయిన తరువాత నది జలాల వాటా తెల్చాలని అప్పటి కేసిఆర్ పలుమార్లు కేంద్రానికి లేఖలు రాసిన రెండు మూడు నెలల్లో తెల్చే నీళ్ల వాటాను తేల్చకుండా గడిచిన 10 ఏండ్లుగా కేంద్రం నానా బెట్టుకుంటూ వచ్చిందని మండిపడ్డారు. నది జలాల వాటాను తేల్చని కేంద్రంను ఏమి అనలేక గత పాలకుల నిర్లక్ష్యం అనడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నమన్నారు. నది జలాల వాటాను తేల్చక పోతే కేంద్రంపై యుద్ధం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు కదా తెలంగాణ ప్రజల తరుపున ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలుపుతుందని దీక్షలు, పోరాటాలు చేయడానికి సైతం సిద్ధంగా ఉన్నామని తెలిపారు.