హైదరాబాద్,(విజయక్రాంతి): కేసులు పెట్టి జైలుకు పంపడం సమస్యకు పరిష్కారం కాదని బీఆర్ఎస్ మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. బహిరంగంగా ప్రజలు తిరుగుబాటు చేస్తే కుట్ర ఎలా అవుతుంది..? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నాడని నిరంజన్ రెడ్డి ఆరోపించారు. అభివృద్ధికి బీఆర్ఎస్ ఆటంకం కలిగిస్తోందని కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పట్నం నరేందర్ రెడ్డి 84 సార్లు సురేష్ తో ఒక్కరోజే మాట్లాడారా..? అని, లగచర్ల గ్రామంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అధికారులపై జరిగిన దాడిలో బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ పాత్ర కూడా ఉందని పిల్ల చేష్టలు చేస్తున్నారని నిరంజన్ రెడ్డి విరుచుకపడ్డారు.
ఫోన్లో మాట్లాడినంత మాత్రాన తప్పు చేసినట్లు అవుతుందా..?, కేటీఆర్ అదేరోజు డీజీపీ, వ్యవసాయ శాఖ అధికారులతో కూడా మాట్లాడారు. అయితే డీజీపీ, వ్యవసాయ శాఖ అధికారుల పాత్ర కూడా ఉందా..?, కేటీఆర్ కు శిక్ష తప్పదనడానికి మహేష్ కుమార్ గౌడ్ ఏమైనా డీజీపీనా..? అని అడిగారు. బీఆర్ఎస్ నేతలపై ఎన్ని వేల కేసులైనా పెట్టుకొండని సవాల్ చేశారు. రైతుల చేతులకు సంకెళ్లేసి తీసుకెళ్తామంటే చూస్తూ ఊరుకోం, అవసరమైతే రైతులతో కలిసి మూకుమ్మడి జైల్ భరో కార్యక్రమం నిర్వహిస్తామని నిరంజన్ రెడ్డి చెప్పారు.