నీటిమల్లింపు నిర్ణయం సహించేది లేదు.
పాలమూరు బిడ్డను అంటూనే ఎండగడతావా..?
సిఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి లేఖ.
నాగర్ కర్నూల్, (విజయక్రాంతి): పాలమూరు ప్రాంత బిడ్డగా చెప్పుకుని ఓట్లు వేయించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాలమూరును ఎండగట్టే విధంగా నిర్ణయాలు తీసుకోవడం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి(Former minister Nagam Janardhan Reddy) మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఏదుల రిజర్వాయర్ నుండి దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు నీటిని మళ్లించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డికి మాజీమంత్రి నాగం జనార్దన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు
మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao)తోపాటు ప్రజాప్రతినిధులు నీటిని మళ్లించవద్దని గతంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖను రాశారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రిగా వైయస్సార్ ఉన్న సమయంలోనే ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ప్రజాప్రతినిధుల నుండి వ్యతిరేకత ఎదురైందన్నారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లా ప్రజలకు నష్టం చేకూరేలా 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందించకుండా గండి కొట్టేందుకు ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై పోరాటాలకు సిద్ధమవుతామని, వెంటనే నిర్ణయాన్ని మార్చుకోకపోతే ప్రజా ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు.