12-04-2025 11:30:33 PM
మహదేవపూర్ (విజయక్రాంతి): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అంటేనే అందరివాడనే అర్థమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలం సూరారం గ్రామంలో శనివారం మాజీ సర్పంచ్ నాగుల సుజాత–లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్, భూపాలపల్లి మాజీ జెడ్పీ చైర్మన్ జక్కు శ్రీ హర్షిణీతో కలిసి కొప్పుల ఈశ్వర్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. అంబేద్కర్ లంటే కేవలం ఎస్సీలు కాదని, అన్ని వర్గాలకు చెందిన వారని అన్నారు. ఆనాడు రాజ్యాంగం రాసింది అంబేద్కర్ అని చెప్పిన తర్వాత కూడా ఆయనను ఒక్క సామాజికవర్గానికే అంటగట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎన్నికల నిర్వహణ, విద్యావిధానం, మహిళలు, విద్యార్ధులు, కార్మికులకు ఏ రకమైన హక్కులుండాలని రాజ్యాంగ రచన చేసిన వ్యక్తి అంబేద్కర్ అని వివరించారు.
ఎస్సీలు, బీసీలకు రిజర్వేషన్‌లు కావాలన్నది కూడా ఆయననేనన్నారు. అయితే ఎస్సీల రిజర్వేషన్‌ల కోసం పోరాటం చేసిండని అంబేద్కర్‌ను ఎస్సీలకే పరిమితం చేయాలని చూశారని, అనేక కుట్రల ఫలితమేనని ఆయన వివరించారు. ప్రపంచ మేధావిగా పేరుగాంచిన అంబేద్కర్‌ను దూరం చేయాలని ఎన్ని కుట్రలు చేసినా ఫలించవన్నారు. దేశంలోనే ఎక్కువ విగ్రహాలు అంబేద్కర్‌వే ఉన్నాయని, ఎన్ని కుట్రలు చేసినా విగ్రహాల ఏర్పాటును ఆపలేకపోతున్నారని ఆయన అన్నారు.అంబేద్కర్ అందించిన రాజ్యాంగంలో అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చేలా రచించారని, కేవలం ఎస్సీలకు మాత్రమే మేలు చేస్తే బీసీ రిజర్వేషన్‌లు ఎలా సాధ్యమయ్యాయని, ఈనాడు 42శాతం రిజర్వేషన్‌లు అడిగే హక్కు ఎక్కడి నుంచి వచ్చిందని ఆయన ప్రశ్నించారు.
ఆర్టికల్ 3 ప్రకారమే మనం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలన్నారు. ఇవన్నీ ఉన్నా కొంతమంది అంబేద్కర్‌ను ఒక్క సామాజిక వర్గానికే అంటగట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. స్వాతంత్య్రం వచ్చి 76సంవత్సరాలు గడుస్తున్నా బారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశాల్లో ఎందుకు చేర్చలేదన్నారు. విద్యార్థి దశలోనే రాజ్యాంగం తెలిసి ఉంటే మన హక్కులు తెలుస్తాయని, ప్రశ్నించే తత్వం వస్తుందన్నారు. రాజ్యాంగంలో ఏం ఉందో తెలియకపోవడం మూలంగానే ప్రశ్నించలేకపోతున్నారని, కానీ ఈనాడు అన్ని వర్గాల్లో చైతన్యం వచ్చిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు బారత రాజ్యాంగాన్ని అన్ని బాషల్లో ఒక సబ్జెక్ట్‌గా పాఠ్యాంశాల్లో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. అన్ని వర్గాల కోసం పోరాడిన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన, ఆకాంక్ష ఉండటం గొప్ప విషయమన్నారు.
ఏప్రిల్ మాసమంతా మహనీయుల మాసమని, ఈ మాసంలో ప్రతి మహనీయుడిని స్మరించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మంతిని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు అంబేద్కర్‌ను అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మాజీ జడ్పీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిని బిఆర్ఎస్ యూత్ నాయకులు జక్కు రాకేష్,బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు లింగంపల్లి శ్రీనివాసరావు,మాజీ సర్పంచ్ శ్రీపతి బాపు, బిఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు ఎండి అలిమ్ ఖాన్, ఆలిండియా అంబేద్కర్ సంఘం మహదేవపూర్ మండల్ అధ్యక్షులు మెరుగు లక్ష్మణ్, హరిజన సంఘాల నాయకులు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.