నీళ్లు తీసుకుపోతుంటే.. తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తోంది ?
చంద్రబాబు లేఖపై కేంద్రంలో దస్త్రం కదులుతోంది
బనకచర్లపై ఏపీ ముందుకెళ్తుంటే సీఎం ఏం చేస్తున్నారు?
హైదరాబాద్: రాష్ట్రంలో నాలుగు ప్రాజెక్టులకు నీళ్లు కేటాయింపులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(MLA Harish Rao) సూచించారు. నీళ్లు కేటాయింపులు పెండింగ్ లో ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. ప్రాజెక్టులకు అనుమతులు సాధించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. గోదావరి నీళ్ల(Godavari water)ను పెన్నాకు తీసుకుపోవాలని ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని హరీశ్ రావు ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం నీళ్లను తీసుకుపోతుంటే తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) ఏం చేస్తోంది? అని ప్రశ్నించారు. ప్రాజెక్టులు ఆపండి అని ఏపీ ప్రభుత్వానికి కనీసం లేఖ కూడా రాయలేదని ఆరోపించారు. ప్రాజెక్టులకు నిధులు కావాలని చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని అడిగారు. బనకచర్ల నిధులివ్వాలని చంద్రబాబు కేంద్రానికి లేఖలు రాశారని చెప్పారు. చంద్రబాబు(N. Chandrababu Naidu) లేఖపై కేంద్రంతో దస్త్రం కదులుతోందన్నారు. రేపోమాపో ఏడీబీ నుంచి ఏపీ ప్రాజెక్టులకు నిధులు వస్తాయని హరీశ్ రావు స్పష్టం చేశారు. బనకచర్లపై ఏపీ ముందుకెళ్తుంటే సీఎం ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. బనకచర్లతో తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతోందని హరీశ్ రావు తెలిపారు.
సలహాదారుగా పెట్టుకునేందుకు ఇంకెవ్వరూ దొరకలేదా?
ఏపీ సీఎస్ గా పనిచేసిన ఆదిత్యానాథ్ దాస్(Adityanath Das)ను సలహాదారుగా పెట్టుకున్నారన్న హరీశ్ రావు.. సలహాదారుగా పెట్టుకునేందుకు ఇంకెవ్వరూ దొరకలేదా?అని ప్రశ్నించారు. మూడు నెలలు జైలు శిక్ష పడిన ఏకైక అధికారి ఆదిత్యనాథ్ దాస్ అని ఆరోపించారు. బనకచర్లపై ఏపీ ముందుకెళ్తుంటే సలహాదారు ఏంచేస్తున్నారు? క్వశన్ చేశారు. తుంగభద్రలోనూ(Tungabhadra) గండికొట్టేందుకు ఏపీ, కర్నాటక ప్రయత్నిస్తున్నాయని హరీశ్ రావు సూచించారు. ఏపీ, కర్నాటక తుంగభద్రకు గండికొడుతుంటే సీఎం ఏం చేస్తున్నారు?.. 2017లో ఏపీ ఇలాంటి ప్రయత్నం చేస్తే గట్టిగా అడ్డుకున్నామన్నారు. బనకచర్ల(Banakacherla project )పై ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మాజీ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
సెక్షన్ 3ని సాధించిందే బీఆర్ఎస్ పార్టీ
సెక్షన్ 3ని సాధించిందే బీఆర్ఎస్ పార్టీ(Bharat Rashtra Samithi party) అన్న హరీశ్ రావు ఇప్పుడు సెక్షన్ 3పై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లిందని సూచించారు. ఏపీ సుప్రీం కోర్టుకు వెళ్తే కనీసం కేవియట్ వేయరా? అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని అధికారులు సరిగ్గా మార్గదర్శకత్వం చేయట్లేదని ఆరోపించారు. మంచి అడ్వకేట్లను పెట్టి సెక్షన్ 3 విషయంలో వాదించాలి కదా.. ఇప్పటికైనా నదీజలాలపై రాష్ట్ర ప్రభుత్వం మొద్దునిద్ర వీడాలని హెచ్చరించారు. అఖిలపక్షం వేస్తే సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రాష్ట్రప్రయోజనాల విషయంలో రాజకీయాలు(Politics) వద్దని పేర్కొన్నారు. ప్రభుత్వం కళ్లు తెరిచి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని హరీశ్ రావు(Harish Rao) డిమాండ్ చేశారు.