calender_icon.png 14 October, 2024 | 5:58 AM

మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య

14-10-2024 03:48:57 AM

కాల్చిచంపిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్

సల్మాన్‌ఖాన్‌ను బెదిరించేందుకే ఈ హత్య

జైలు నుంచే బిష్ణోయ్ ప్రకటన

మహారాష్ట్ర రాజకీయాల్లో దుమారం

ముంబై, అక్టోబర్ 13: మహారాష్ట్ర మాజీ మంత్రి, బాలీవుడ్ సినీ స్టార్లతో సన్నిహిత సంబ ంధాలున్న ఎన్సీపీ (అజిత్ పవార్) నాయకుడు బాబా సిద్ధిఖీ దారుణ హత్యకు గురయ్యారు. శనివారం సాయంత్రం ముంబైలోని బాంద్రా లో ఆయన కుమారుడి కార్యాలయం ముందే సిద్ధిఖీని ముగ్గురు వ్యక్తులు కాల్చి చంపారు.

సిద్ధిఖీని హత్య చేసింది తామేనని లారెన్స్ బిష్ణో య్ గ్యాంగ్ ఆదివారం ప్రకటించింది. ఎంతో మంది సెలబ్రిటీలకు మిత్రుడైన సిద్ధిఖీ హత్య  తో ముంబై ఉలిక్కిపడింది. మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా కాక పెరిగింది. హత్యచేసిన ముగ్గురిలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఒకడు పరారీలో ఉన్నాడు. 

పటాకుల మోతల చాటున..

సిద్ధిఖీ హత్యకు బిష్ణోయ్ గ్యాంగ్ 5 వారాల నుంచే రెక్కీ నిర్వహించినట్లు తేలింది. ఓ అద్దె ఇంట్లో మకాం వేసి సిద్ధిఖీ దినచర్యను పూర్తిగా పరిశీలించిన తర్వాత దాడికి తెగబడ్డారు. సిద్ధిఖీ కుమారుడు జీషన్ కూడా ఎమ్మెల్యే. ఆయన కార్యాలయంలో శనివారం దసరా వేడుకలను నిర్వహించారు. సిద్ధిఖీ స్వయంగా పటాకులు కాల్చి కార్యకర్తలతో ఆనందంగా గడిపారు.

అదే మంచి అదనుగా భావించిన నిందితులు పటాకుల మోతలోనే సిద్ధిఖీపై మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో వై క్యాటగిరీ భద్రత ఉన్నా ఆయన ప్రాణాలు కాపాడుకోలేకపోయారు. సిద్ధిఖీ కడుపు, ఛాతీలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. ఆయనను వెంటనే లీలావతి దవాఖానకు తరలించగా, అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. అరెస్టయి నవారిలో బల్జీత్‌సింగ్‌ది హర్యానా కాగా, ధరమ్‌జీత్‌తోపాటు పరారీలో ఉన్న శివకుమార్‌ది యూపీలోని బహ్రయిచ్‌కు చెందినవాడు. 

సల్మాన్‌ఖాన్‌ను బెదిరించేందుకే..

ముంబైలో అత్యంత ఖరీదైన ఇఫ్తార్ విందు లు ఏర్పాటుచేసే నేతగా సిద్ధిఖీకి గుర్తింపు ఉన్నది. ఆయన ఎన్సీపీ (అజిత్ వర్గం) పార్టీలో కీలక నేత. బాలీవుడ్ హీరోలు సల్మాన్‌ఖాన్, షారుక్‌ఖాన్‌తోపాటు చాలామంది సినీ ప్రముఖులు, సెలబ్రిటీలకు మంచి మిత్రుడు. బాలీవు డ్ చిత్ర పరిశ్రమలో ఏ సమస్య వచ్చినా సిద్ధిఖీనే మధ్యవర్తిత్వం వహించి సమస్యలు పరిష్క రిస్తారనే పేరున్నది.

ఏటా నిర్వహించే ఇఫ్తార్ విందుకు సల్మాన్, షారుక్‌తదితరులు హాజరవుతుంటారు. కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్‌ఖాన్ నిర్దోషిగా బయటపడినప్పటి నుంచి ఆయనను చంపేందుకు బిష్ణోయ్ గ్యాంగ్ ప్రయత్నిస్తోంది. కొన్ని నెలల క్రితం సల్మాన్ ఇంటిపై ఈ గ్యాంగ్ సభ్యులు కాల్పులు జరిపారు. తాజాగా సిద్ధిఖీని తామే చంపామని ఈ గ్యాంగ్ ప్రకటించింది.

సల్మాన్‌కు తమ సత్తా తెలిపేందుకే సిద్ధిఖీని చంపేశామని బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు షుబూ లోంకర్ అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెట్టాడు. ‘సల్మాన్‌ఖాన్.. మేం ఈ యుద్ధాన్ని కోరుకోలేదు. నువ్వే మా సోదరులను గాయపరిచావు. మాకు ఎవరూ శత్రువులు కాదు.

కానీ, సల్మాన్‌ఖాన్‌కు, దావూద్‌కు సాయం చేసేవారు ఎవరైనా సరే వారి అకౌంట్లు సెటిల్ చేస్తాం’ అని హెచ్చరించాడు. సల్మాన్‌తోపాటు మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతో సిద్ధిఖీకి సన్నిహిత సంబంధాలు ఉన్నందువల్లే అతన్ని చంపేశామని ప్రకటించాడు. సల్మాన్ ఇంటిపై కాల్పులు జరిపిన కేసు లో అరెస్టయి కస్టడీలోనే ఆత్మహత్య చేసుకొన్న బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యు డు అనుజ్ తపన్‌ను కూడా ఆ పోస్టులో గుర్తుచేసుకొన్నాడు. 

సిద్ధిఖీకి సల్మాన్ నివాళులు

తన మిత్రుడు సిద్ధిఖీ హత్యతో సల్మాన్ తీవ్ర వేదనలో ఉన్నట్లు సమాచారం. ఆదివారం ఆయన సిద్ధిఖీ నివాసాని వెళ్లి మిత్రుడికి కడసారి వీడ్కోలు పలికారు. తన ఇతర కార్యక్రమాలన్నీ రద్దుచేసుకొన్నట్లు తెలిసింది. సిద్ధిఖీ మృతిపట్ల బాలీవుడ్ నటి శిల్పాషెట్టితోపాటు సెలబ్రిటీలు సంతాపం ప్రకటించారు.   

సీఎం రాజీనామా చేయాలి

సిద్ధిఖీ హత్యపై మహారాష్ట్రలో రాజకీయ దుమారం రేగుతున్నది. ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. వై క్యాటగిరీ భద్రత ఉన్న నేతనే కాపాడలేని ప్రభుత్వం ఇక సామాన్య ప్రజలను ఏం కాపాడుతుందని ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్‌పవార్ మండిపడ్డారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

సీఎంతోపాటు డిఫ్యూటీ సీఎంలు అజిత్‌పవార్, దేవంద్ర ఫడ్నవిస్ తమ పదవులకు రాజీనామా చేయాలని శివసేన (యూబీటీ), కాంగ్రెస్ డిమాండ్ చేశాయి. శాంతిభద్రతలు కాపాడటంలో షిండే ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని శరద్‌పవార్ ఆరోపించారు. సిద్ధిఖీ హత్య నేపథ్యంలో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ ఇంటివద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.