calender_icon.png 26 April, 2025 | 8:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇస్రో మాజీ చీఫ్ ‘కస్తూరి’ కన్నుమూత

26-04-2025 01:02:21 AM

  1. తొమ్మిందేడ్ల పాటు ఇస్రో చైర్మన్‌గా సేవలు
  2. మూడు పద్మ పురస్కారాల స్వీకర్త
  3. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ
  4. సంతాపం తెలిపిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్

బెంగళూరు, ఏప్రిల్ 25: ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ (84) శుక్రవారం కన్నుమూశారు. ఉదయం 10.43 గంటలకు బెంగళూరులోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచినట్టు ఇస్రో ప్రకటించింది. ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యా హ్నం వరకు ఆయన భౌతికకాయాన్ని బెంగళూరులోని రామన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు.

ఆయన 1994-2003 వరకు (తొమ్మిదేండ్ల పాటు) ఇస్రో చైర్మన్‌గా విధులు నిర్వర్తించారు. కస్తూరి రంగన్ హయాంలోనే ఇస్రో తొలి లూనార్ మిషన్ ప్రయోగం దిశగా అడుగులు వేసింది. ఆయన జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) చాన్స్‌లర్‌గా, కర్ణాటక నాలెడ్జ్ కమిషన్ చైర్మన్‌గా కూడా విధులు నిర్వర్తించారు. 2003-2009 వరకు రాజ్యసభ సభ్యుడిగా కూడా కొనసాగారు.

పంచవర్ష ప్రణాళికా సంఘం మెంబర్‌గా కూడా సేవలందించారు. ఇస్రో శాటిలైట్ సెంటర్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఇన్సాట్-2, ఐఆర్‌ఎస్-1ఏ/1బీ, మరిన్ని శాస్త్రీయ ఉపగ్రహాలను అభివృద్ధి చేయడంలో కీలకపాత్ర పోషించారు. భారతదేశం మొట్టమొదటిసారిగా ప్రయోగించిన భూపరిశీలన ఉపగ్రహాలు భాస్కర 1, భాస్కర 2 కు ఆయన ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా ఉన్నారు. కాస్మిక్ ఎక్స్ రే కిరణాలు, గామా కిరణాలు భూ వాతావరణంపై ఎటువంటి ప్రభావం చూపుతాయో అనే దానిపై పలు పరిశోధనలు చేశారు. 

మూడు పద్మ అవార్డులు అందుకున్న కస్తూరి రంగన్

కస్తూరి రంగన్ భారత అత్యున్నత పురస్కారాలైన పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులను అందుకున్నారు. 24 అక్టోబర్ 1940లో కస్తూరి రంగన్ కేరళలోని ఎర్నాకుళంలో కృష్ణస్వామి అయ్యర్, విశాలాక్షి దంపతులకు జన్మించారు. కస్తూరి రంగన్ పూర్వీకులు తమిళనాడులో ఉండేవారు. కస్తూరి రంగన్ శ్రీ రామ వర్మ హైస్కూల్‌లో విద్యాభ్యాసం కొనసాగించారు.

ముంబైలోని రామ్‌నారియాన్ రుయియా కాలేజ్ నుంచి డిగ్రీ పట్టా పొందారు. అనంతరం ముంబై విశ్వవిద్యాలయంలో కస్తూరి మాస్టర్స్ పూర్తి చేశారు. 1971లో కస్తూరి రంగన్ డాక్టరేట్ అందుకున్నారు. ఖగోళశాస్త్రంలో 240కి పైగా పరిశోధనా పత్రాలను ఆయన ప్రచురించారు. ఆయనకు 1982లో పద్మశ్రీ, 1992 పద్మ భూషణ్, 2000వ సంవత్సరంలో పద్మ విభూషణ్ అవార్డులు వరించాయి.   

విచారం వ్యక్తం చేసిన మోదీ.. 

కస్తూరి రంగన్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. కస్తూరి రంగన్‌తో ఉన్న ఫొటోను ఎక్స్‌లో షేర్ చేసిన మోదీ.. ‘భారతీయ శాస్త్ర సాంకేతిక, విద్యారంగాల్లో ఎన్నో సేవలందించిన కస్తూరి రంగన్ మృతి నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన దార్శనిక నాయకత్వం, నిస్వార్థ సహకారం దేశానికి ఎల్లప్పుడూ గుర్తుండిపోతుంది. భారతదేశ అంతరిక్ష రంగాన్ని కొత్త శిఖరాలకు చేర్చారు. ఆయన నాయకత్వంలో ఇస్రో ఎన్నో ప్రతిష్ఠాత్మక ఉపగ్రహ ప్రయోగాలు చేసింది. ఇటీవలే వచ్చిన జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ) ముసాయిదా కమిటీకి కూడా అధ్యక్షుడిగా వ్యవహరించారు. 

సంతాపం తెలిపిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్

ఇస్రో మాజీ చైర్మన్ డా.కస్తూరి రంగన్ మృతిపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సంతాపం తెలిపారు. కస్తూరి రంగన్ నేతృత్వంలోని కమిటీ భారతీయతను ప్రతిభింబిస్తూ భవిష్యత్ భారతావనికి పునాదులు వేసేలా నూతన విద్యా విధానాన్ని రూపొందించినట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అంతరిక్ష రంగంతో పాటు విద్యారంగంలోనూ ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని బండి సంజయ్ అన్నారు. దేశం అంతరిక్ష రంగం ఎంతో ఎత్తుకు ఎదిగేందుకు ఆయన చేసిన సేవలు విలువైనవని తెలిపారు.