25-04-2025 02:37:35 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కె.కస్తూరి రంగన్(84) కన్నుమూశారు. బెంగళూరులోని తన నివాసంలో శుక్రవారం ఉదయం 10.43 గంటలకు తుదిశ్వాస విడిచారు. 1994 నుంచి 2003 వరకు ఇస్రో చైర్మన్‌గా పనిచేసిన కస్తూరి రంగన్ పీఎస్‌ఎల్వీ, జీఎస్‌ఎల్వీ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు. 2020 జాతీయ విద్యావిధానం రూపకల్పన కమిటీ చైర్మన్ గా, జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ ఛాన్సలర్ గా విధులు నిర్వహించారు.
కస్తూరి రంగన్ 2003-2009 మధ్య రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అంతేకాకుండా ప్రణాళిక సంఘం సభ్యుడిగా కూడా సేవలందించారు. అలాగే 2004-2009 మధ్య కాలంలో బెంగళూరులోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ డ్ స్టడీస్ కు డైరెక్టర్ గా పని చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సర్కార్ తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యావిధానం ముసాయిదా కమిటీకి అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఆయన పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలు అందుకున్నారు.