భోపాల్, జూలై 14 : మధ్యప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రోహిత్ ఆర్య బీజేపీలో చేరారు. మూడు నెలల క్రితమే హైకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన ఆయన ఆదివారం బీజేపీ స్టేట్ చీఫ్ డాక్టర్ రాఘవేంద్ర శర్మ ఆధ్వర్యంలో కషాయ కండువా కప్పుకున్నారు. 1962 ఏప్రిల్ 28న జన్మించిన జస్టిస్ ఆర్య 1984 ఆగస్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. 2003 ఆగస్టు 26న మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయవాదిగా నియమితులయ్యారు. 2013 సెప్టెంబర్ 12న మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన ఆయన 2015 మార్చి 26న శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. తన వృత్తి జీవితంలో అనేక సంచలన కేసులను పరిష్కరించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2021లో ఇందౌర్‌లో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో చెలరేగిన మతపరమైన ఘర్షణలు, హాస్యనటులు మునావర్ ఫరూకీ, నలిన్ యాదవ్ కోవిడ్ ప్రోటోకాల్ ఉల్లంఘించిన కేసులను విచారించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.