13-02-2025 09:50:03 AM
హైదరాబాద్: గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party ) కార్యాలయంపై దాడి చేసిన కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (Yuvajana Sramika Rythu Congress Party) నాయకుడు, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Former Gannavaram MLA Vallabhaneni Vamsi)ని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని రాయదుర్గం(Rayadurgam)లోని ‘మై హోమ్ భుజ’ నుంచి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అధికారులు ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా విజయవాడకు తరలిస్తున్నట్లు సమాచారం.
అయితే, ఆయన అరెస్టు కేవలం టీడీపీ కార్యాలయం(TDP office)పై దాడి కేసుకు సంబంధించినదా లేదా అతనిపై అదనపు అభియోగాలు ఉన్నాయా అనేది అస్పష్టంగా ఉంది. కాగా, కిడ్నాప్, దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద వంశీని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. వంశీపై బీఎన్ఎస్ సెక్షన్లు 140(1), 308, 351(3), రెడ్ విత్3(5) కింద కేసులు నమోదు చేశారు. విజయవాడ పటమట పోలీసులు వంశీని అరెస్టు చేశారు. అంతే కాకుండా ఏపీ పోలీసులు(AP Police) వంశీ ఇంటికి నోటీసులు అంటించారు.
కంప్యూటర్ ఆపరేటర్(Computer Operator) సత్యవర్థన్ ను కిడ్నాప్ చేసి బెదిరించినట్లు ఆరోపణలున్నాయి. గన్నవరం టీడీపీ ఆఫీస్ లో సత్యవర్థన్ కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో తనను బెదిరించారని సత్యవర్థన్ ఫిర్యాదు చేశాడు. తనను బెదిరించి తప్పుడు వాంగ్మూలం ఇప్పించారని సత్యవర్థన్ ఫిర్యాదులో పేర్కొన్నాడు.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై 2023 ఫిబ్రవరి 20న దాడి జరిగింది.ఈ కేసులో వంశీతో పాటు మరో 88 మందిని నిందితులుగా చేర్చారు. వంశీ అరెస్టు నుండి రక్షణ కోరుతూ గతంలో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ ఫిబ్రవరి 20 న జరగనుంది. కోర్టు విచారణకు కొద్ది రోజుల ముందు అతన్ని అరెస్టు చేయడంతో కీలక పరిణామం చోటుచేసుకుంది.