calender_icon.png 25 October, 2024 | 7:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు విచారణ

25-10-2024 05:16:58 PM

హైదరాబాద్,(విజయక్రాంతి):  కాళేశ్వరం కమిషన్‌ బహిరంగ విచారణ మూడోరోజు కొనసాగుతుంది. రామగుండం మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లు కమిషన్ ముందు విచారణకు శుక్రవారం హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలపై మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు విచారణ కాసేపటి క్రితమే ముగిసింది. మళ్లీ సోమవారం హాజరు కావాలని కాళేశ్వరం కమిషన్ ఆదేశించింది. మూడు బ్యారేజీలపైనా స్పష్టంగా సమాధానాలు ఇవ్వాలని కమిషన్ చెప్పింది. దీంతో నల్లా వెంకటేశ్వర్లు కాళేశ్వరం కమిషన్ కు సహకరిస్తూ వచ్చారు. మొదట కట్టిన కాఫర్ డ్యాం మునగడంతో ఎత్తు పెంచాల్సి వచ్చిందని వెంకటేశ్వర్లు చెప్పారు. 2019 నుంచే బ్యారేజీల్లో సమస్యలు వచ్చాయని, దానిపై నీటిపారుదల మఖ్యకార్యదర్శి, ఈఎన్సీ జనరల్ భేటీలు జరిగాయని వెంకటేశ్వర్లు కమిషన్ కు వెల్లడించారు. డిజైన్ల తయారీలో ఆలస్యం జరిగిందని, అదనపు పనులో మార్పుల వల్ల ఖర్చు పెరిగిందని మాజీ ఈఎన్సీ పేర్కొన్నారు.

పనుల్లో మార్పులు జరుగుతే ఖర్చు భారీగా పెరుగుతుందా..? అని కమిషన్ ప్రశ్నించింది. ప్రాణహిత-చేవెళ్లలో రూ.750 కోట్ల పనులు విలువ లేకుండా పోయాయన్న వెంకటేశ్వర్లు సవరించిన అంచనాలను అప్పటి అధికారులు ఆమోదించారన్నారు. మేడిగడ్డకు సబ్ స్టాన్సియల్, మిగతా రెండింటికీ పూర్తి సర్టిఫికెట్ ఇచ్చామని తెలిపారు. స్థానికాంశాలు, భూసేకరణ వల్లే పనుల్లో జాప్యం జరిగిందని, పనులు ఆలస్యమైనప్పుడు మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. అత్యవసరం దృష్ట్యా డిజైన్లు ఆలస్యమైనా పనులు చేయాలని చెప్పామని, కరోనా వేళ ప్రభుత్వం నిబంధనలకు మినహాయింపు ఇచ్చిందని, బ్యాంకు గ్యారంటీల్లో సగానికి పైగా వెనక్కి ఇచ్చామని వెంకటేశ్వర్లు వెల్లడించారు.