calender_icon.png 19 September, 2024 | 7:18 AM

మంథనిలో దేవాలయాల సందర్శనలో మాజీ క్రికెటర్ వెంకటపతి రాజు

16-09-2024 08:50:12 PM

మంథని,(విజయక్రాంతి): పెద్దపెల్లి జిల్లా మంత్రపురిగా ప్రసిద్ధిగాంచిన మంథనిలో ఆధ్యాత్మికత ఉట్టిపడుతుందని, ఇక్కడి పురాతనమైన దేవాలయాలను సందర్శిస్తే ఎంతో తృప్తి కలుగుతుందని ప్రముఖ అంతర్జాతీయ మాజీ క్రికెటర్ వెంకటపతి రాజు అన్నారు. సోమవారం మంథని పట్టణంలోని  ఎంతో విశిష్టత కలిగిన శ్రీ భిక్షేశ్వర స్వామి, శ్రీ ఓంకారేశ్వర స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ శీలేశ్వర, శ్రీ సిద్దేశ్వర,  శ్రీ గౌతమేశ్వర స్వామి, శ్రీ సీతారామ, శ్రీ బాల సరస్వతి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకం కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

అనంతరం సతీ సమేతంగా ఈ మధ్యకాలంలో ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్టులు, క్రికెట్ కామెంటేటర్లు మహావాది సుదీర్, విజయకుమార్ ల మాతృమూర్తి సరోజినీ దేవి స్వర్గస్తులైన సందర్భంగా వారి స్వగృహము వెళ్లి వారిని పరామర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో మంథని గ్రామం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుందని, మేధావుల గడ్డగా పేరొందిన మంథని  రావడం ఎంతో సంతోషం కలిగిస్తుందన్నారు. సనాతన సంప్రదాయాలను పాటిస్తున్న మంథని రావడం ఎంతో అదృష్టమని ఆయన భార్య ఉమామహేశ్వరి తెలిపారు. అనంతరం శ్రీ శీలేశ్వర, సిద్దేశ్వర దేవస్థానం, పెంజేరుకట్ట హనుమాన్ దేవాలయం  తరపున లోకే మనోహర్ వెంకటపతి రాజు దంపతులు ఇరువురిని ఘనంగా సన్మానించి జ్ఞాపిక ను అందజేశారు. వెంకటపతి రాజు రాక సందర్భంగా పట్టణంలోని యువకులు ఆయన చూడడానికి ఇంత ఉత్సాహం చూపారు.

భారతదేశ తరపున 1992, 96 ప్రపంచకప్ ల్లో ప్రాతినిధ్యం వహించారు. అలాగే 28 టెస్ట్ మ్యాచ్ ల్లో 93 వికెట్లు, 53 వండే మ్యాచ్ ల్లో 63 వికెట్లు సాధించారు. ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల్లో 589 వికెట్లు తీసుకున్నారు. 2002 నుండి 2007 వరకు ఇండియన్ టీం సెలెక్టర్ గా కొనసాగారు. అక్బనిస్తాన్ టీంకు మెయిన్ కోచ్ గా వ్యవహరించారు. క్రికెట్ తో కొత్తగా ఎంటర్ అవుతున్న టీమ్ లకు ఐసీసీ కోచ్ గా నియమించింది. ప్రస్తుతం ఆయన క్రికెట్ కామెంటేటర్ గా కొనసాగుతున్నారు. ఆయన వెంట మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రి రమాదేవి, సీనియర్ కౌన్సిలర్ చొప్పకట్ల హనుమంతరావు, మాజీ సర్పంచ్ ఓడ్నాల శ్రీనివాస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉప్పట్ల శ్రీనివాస్, పెంటరి రాజు  తదితరులు ఉన్నారు.