భువనేశ్వర్: హాకీ మాజీ కోచ్ జగ్బీర్ సింగ్ శుక్రవారం గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం జగ్బీర్ సింగ్ రూర్కెలా వేదికగా జరుగుతున్న హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో టీమ్ గొనాసికాకు కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం జట్టు ట్రెయినింగ్ సెషన్‌ను పర్యవేక్షిస్తున్న జగ్బీర్ సింగ్‌కు ఉన్నట్లుండి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. వెంటనే ఆయన్ను సమీపంలోని అపోలో ఆసుపత్రికి తరలించగా గుండెలో ఒక బ్లాకు మూసుకుపోయిందని వైద్యులు పేర్కొన్నారు.
చికిత్స చేస్తున్న సమయంలో జగ్బీర్ గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు. జగ్బీర్ సింగ్ 1985 నుంచి 1996 వరకు భారత్ తరఫున 175 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించారు. 1988 సియోల్, 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత జట్టులో జగ్బీర్ సభ్యుడిగా ఉన్నారు. 1986 సియోల్ ఆసియా గేమ్స్‌లో స్వర్ణం నెగ్గిన టీమిండియాలో సభ్యుడిగా ఉన్న జగ్బీర్ 1990 బీజింగ్ గేమ్స్‌లో రజతం నెగ్గిన జట్టులోనూ సభ్యుడిగా ఉన్నాడు. ఇక 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టుకు జగ్బీర్ కోచ్‌గా వ్యవహరించారు. 59 ఏళ్ల జగ్బీర్ గతంలో ఎయిర్ ఇండియాలో ఉద్యోగిగా విధులు నిర్వర్తించారు.