calender_icon.png 15 November, 2024 | 6:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ కన్నుమూత

09-08-2024 01:06:00 AM

  1. కోల్‌కతాలోని తన నివాసంలో తుదిశ్వాస
  2. కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న సీపీఎం నేత
  3. బెంగాల్‌కు రెండుసార్లు సీఎం పనిచేసిన వ్యక్తి

కోల్‌కతా, ఆగస్టు 8: పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, సీపీఎం సీనియర్ నేత బుద్ధదేవ్ భట్టాచార్య గురువారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన కోల్‌కతాలోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ సలీం వెల్లడించారు. ఊపిరితిత్తుల వ్యాధి, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో కొంతకాలంగా ఆయన చికిత్స తీసుకుంటున్నారు. చూపు కూడా మందగించినట్లు తెలుస్తోంది.

పశ్చిమబెంగాల్‌కు భట్టాచార్య 2000 మధ్య ముఖ్యమంత్రిగా పనిచేశారు. సీపీఎం పార్టీ పొలిట్‌బ్యూరోలో కీలకంగా వ్యవహరించారు. కమ్యూనిస్టు మహానేత జ్యోతిబసు తర్వాత 2000లో బెంగాల్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. మమతా బెనర్జీ హవా, భూములపై పోరాటం ఫలితంగా 2011లో ఆయన నేతృత్వంలోని సీపీఎం అధికారాన్ని కోల్పోయింది. అనంతరం తృణమూల్ కాంగ్రెస్ రాష్ట్రమంతా పాతుకుపోవడంతో సీపీఎం ప్రాభవం కోల్పోయింది. భట్టాచార్య కూడా క్రమంగా ప్రజాజీవితానికి దూరమయ్యారు. 

టీచర్ నుంచి సీఎం స్థాయికి

బుద్ధదేవ్ 1944 మార్చి 9న జన్మించారు. కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కాలేజీలో చదువుకున్నారు. రాజకీయాల్లోకి రాకముందు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 1977లో కాశీపూర్ నుంచి ఎమ్మెల్యేగా మొదటిసారి ఎన్నికయ్యారు. జ్యోతిబసు ప్రభుత్వ క్యాబినెట్‌లో 18 ఏళ్ల పాటు మంత్రిగా చేశారు. 2001, 2006లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయ తీరాలకు చేర్చి రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. భట్టాచార్య పదవిలో ఉన్నప్పుడు కూడా సాధారణ జీవితాన్ని గడిపారు.