calender_icon.png 23 April, 2025 | 4:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ అరెస్ట్

23-04-2025 12:42:50 AM

- విజయవాడకు తరలించిన సీఐడీ అధికారులు

- నటి కాదంబరి జేత్వానీ వేధింపుల కేసులో అదుపులోకి

చేవెళ్ల, ఏప్రిల్ 22: ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ శాఖ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి పీఎస్‌ఆర్ ఆంజనేయులును ముంబైకి చెందిన నటి కాదంబరి జేత్వానీ వేధింపుల కేసులో సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు . మెయినాబాద్ మండలం కాశీంబౌలీలోని ఓ ఫామ్‌హౌస్‌లో అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు.

ఈ మేరకు మొయినాబాద్ పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు.  నటి కాదంబరి జేత్వానీ, ఆమె కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్ట్ చేసి, వేధించారనే ఆరోపణలు ఉన్నాయి. 2024 ఆగస్టులో కాదంబరి జేత్వానీ తనపై ముంబైలో ఉన్న ఒక ప్రముఖ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని కేసు పెట్టారు. దీనికి ప్రతిగా, ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత కేవీఆర్ విద్యాసాగర్ ఆమెపై భూమి మోసం కేసు పెట్టారు.

ఈ కేసులో ఆంజనేయులు సహా ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులు ఆమెను, ఆమె కుటుంబాన్ని ముంబై నుంచి విజయవాడకు తరలించి 40 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉంచారని ఆమె ఆరోపించారు. ఈ కేసులో ఆంజనేయులుతో పాటు, విజయవాడ మాజీ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా, విశాల్ గున్ని అనే మరో ఐపీఎస్ అధికారిపై కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ ముగ్గురు అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కాగా, ఇతర ఇద్దరు అధికారులు ముందస్తు బెయిల్ పొందగా, ఆంజనేయులు ఇప్పటివరకు బెయిల్ కోసం దరఖాస్తు చేయలేదు.