calender_icon.png 2 October, 2024 | 1:46 PM

తెలంగాణ విద్యాకమిషన్ ఏర్పాటు

04-09-2024 04:00:00 AM

  1. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
  2. ఒకరు చైర్మన్, ముగ్గురు సభ్యులతో కమిషన్ 
  3. రెండేళ్ల పాటు పదవులు
  4. పేర్లను త్వరలో ప్రకటించే అవకాశం
  5. చైర్మన్‌గా ఆకునూరి మురళి పేరు పరిశీలన?

హైదరాబాద్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): రాష్ట్రంలో కొత్తగా విద్యాకమిషన్ ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నూతన విద్యావిధానాన్ని రూపొందించేందుకు, పాలసీల రూపకల్పనకు ఖరారుకు ముందడుగు వేసింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం మంగళవారం జీవో -నెం. 27ను విడుదల చేశారు. ప్రీ ప్రైమరీ నుంచి సాంకేతిక విద్య, యూనివర్సిటీ విద్య వరకు ఈ కమిషన్ విద్యావిధానాన్ని రూపొందించనుంది.

ఈ కమిషన్ విధివిధానాలను ఆయా ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ కమిటీకి ఒక చైర్‌పర్సన్ ఉంటారు. విద్యారంగంలో నిష్ణాతులైన ముగ్గురిని సభ్యులుగా నియమిస్తారు. రెండేళ్ల పాటు వీరు పదవుల్లో కొనసాగుతారు. ప్రభుత్వ విభాగం హెచ్‌వోడీ స్థాయి ఐఏఎస్ అధికారి కమిషన్ సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. ఈ కమిషన్ విద్యారంగంలోని నిపుణులతో సంప్రదింపులు జరిపి విద్యావిధానంలో తీసుకోవాల్సిన చర్యలు, రూపొందించాల్సిన పాలసీలను ప్రభుత్వానికి పలు సిఫారసులు చేస్తుంది. 

త్వరలో చైర్మన్, సభ్యుల నియామకం..

విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నట్లు, అందుకు విద్యాకమిషన్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు ప్రకటించారు. ఈక్రమంలోనే విద్యాకమిషన్ ఏర్పాటుకు గానూ తాజగా ఉత్తర్వులను జారీ చేసింది. ప్రస్తుతానికి చైర్మన్, సభ్యులను సర్కారు నియమిం చలేదు. త్వరలోనే చైర్మన్ సహా ముగ్గురు సభ్యులను ప్రభుత్వం నియమించనుంది. రాష్ర్టంలో విద్యాప్రమాణాలు రానురాను దిగజారుతున్నాయి. నాణ్యమైన విద్య అందడం లేదు. ముఖ్యంగా పాఠశాల విద్యలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు దిగజారుతు న్నాయి.

నేషనల్ అచ్చీవ్‌మెంట్ సర్వే ఫలితాల్లోను ఇదే వెల్లడయ్యింది. యూనివర్సిటీల్లో పబ్లికేషన్ల సంఖ్య తగ్గుతోంది. పరిశోధనలు కుంటుపడుతున్నాయి. ప్రస్తుత మార్కెట్‌కు అవసరమైన నైపుణ్యాలు కలిగిన గ్రాడ్యుయే ట్లు దొరకడం లేదు. వీటిన్నింటిని అధిగమించేందుకు విద్యారంగంలో సమగ్ర మార్పులకు సర్కారు శ్రీకారం చుట్టనుంది. ప్రీ ప్రైమరీ నుంచి ఉన్నతవిద్య వరకు సమగ్ర పాలసీ తయారీకి కమిషన్ ఏర్పాటు చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇందుకు రోడ్ మ్యాప్‌ను ఖరారు చేయనుంది. ఆయా బాధ్యతలను విద్యాకమిషన్‌కు అప్పగించనుంది.

అధ్యయనం చేసే అంశాలు..

  1. విద్యార్థులందరికి పూర్వ ప్రాథమిక విద్యనందించడం. ప్రాథమిక బడుల్లో ప్రీ ప్రైమరీ స్కూళ్ల ఏర్పాటు.
  2. పాఠశాలల్లో నాణ్యమైన విద్యనందించడం. విద్యార్థుల సమగ్రాభివృద్ధికి చర్యలు.
  3. ఉన్నత విద్యలో నాణ్యమైన విద్యనందించడం. ఉన్నత విద్యాసంస్థలను అంప్రెటీస్‌షిప్, ఎంప్లాయబిలిటీ స్కిల్స్‌తో అనుసంధానించడం.
  4. ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు గల విద్యార్థుల్లో బేసిక్స్ స్కిల్స్ నైపుణ్యతలు గల వారిగా తీర్చిదిద్దడం.
  5. విలువలతో కూడిన విద్యనందించడం, విద్యార్థులను ఉత్తమ, బాధ్యతగల అంతర్జాతీయ పౌరులుగా తీర్చిదిద్దడం.

పరిశీలనలో ఆకునూరి మురళి పేరు?

విద్యాకమిషన్ ఏర్పాటులో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. విద్యాకమిషన్ చైర్మన్‌గా మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి పేరు ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. విద్యారంగంలో ఆయనకు విశేష అనుభవం ఉవంది. ఏపీలో నాడు  కార్యక్రమం, ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ విధానం అమలుకు ఆకునూరి మురళి ఇచ్చిన నివేదికే కారణమంటున్నారు. ప్రీ ప్రైమరీ నుంచి ఉన్నత విద్యలో మార్పు చేయవలసిన అంశాలను ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి మురళి ఓ నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. మరోవైపు విద్యాకమిషన్ సభ్యులుగా కొంత మంది పేర్లు వినిపిస్తున్నాయి. ఓ ఇద్దరు రిటైర్డ్ ప్రొఫెసర్లను, మరొకరిని క్షేత్రస్థాయిలో విద్యారంగంపై అవగాహన ఉన్న వ్యక్తిని సభ్యులుగా నియమించనున్నట్లు సమాచారం. త్వరలోనే పేర్లను ప్రభుత్వం ప్రకటించనుంది.