calender_icon.png 20 January, 2025 | 10:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బలమైన వ్యవస్థగా హైడ్రాకు రూపు

13-07-2024 01:51:04 AM

2 వేల కి.మీ. పరిధిలో విపత్తు నిర్వహణ బాధ్యతలన్నీ అప్పగింత

నగరం విస్తరణకు అనుగుణంగా ఏర్పాటు

జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, మిగతా విభాగాలతో సమన్వయం 

అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, జూలై 12 (విజయక్రాంతి): హైదరాబాద్ సిటీ విస్తరణకు అనుగుణంగా ప్రజలకు విస్తృత సేవలను అందించేలా హైదరాబాద్ డిజా స్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ (హైడ్రా) రూపుదిద్దు కోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. జాతీయ విపత్తుల నిర్వహణ చట్టానికి అనుగుణంగా ఈ కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. హైడ్రా వ్యవస్థాగత నిర్మాణం, విధివిధానాలపై మరింత అధ్యయనం, కసరత్తు చేయాలని సీఎం సూచించారు. హైడ్రా ఏర్పాటు, సంబంధిత విధివిధానాలపై సీఎం శుక్రవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.

జీహెచ్‌ఎంసీతో పాటు, హెచ్‌ఎండీఏ, వాటర్ బోర్డు, విజిలెన్స్, ట్రాఫిక్, విద్యుత్తు, పోలీస్ విభాగాలను సమన్వయం చేసుకొని మరింత సమర్థంగా హైడ్రా పనిచేసేలా ఉండాలని అధికారులకు పలు సూచనలు చేశారు. ఇప్పుడున్న ఎన్‌ఫోర్స్ మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విభాగాన్ని అందుకు అనుగు ణంగా పునర్‌వ్యవస్థీకరించాలని ఆదేశించారు. కొత్త విభాగంలో ఏయే స్థాయి అధికారులుండాలి.. ఎంత మంది సిబ్బంది ఉండాలి.. ఏయే విభాగాలపై వీరిని డిప్యుటేషన్‌పై తీసుకోవాలనే అంశాలపై స్పష్టమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. జీహెచ్‌ఎంసీతో పాటు ఓఆర్‌ఆర్ వరకు 2 వేల కిలోమీటర్ల పరిధిలో హైడ్రా పనిచేయాల్సి ఉంటుందని, పని విభజనకు వీలుగా సిటీలో ఇప్పుడున్న జోన్ల తరహాలో భౌగోళిక పరిధిని నిర్దేశించాలని సీఎం సూచించారు.

అవసరమైతే హైడ్రాకు ప్రత్యేక నిధులు కేటాయించే అంశాన్ని పరిశీలించాలని చెప్పారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోగా ముసాయిదా తయారుచేయాలని సీఎం ఆదేశించారు. విపత్తుల నిర్వహణతో పాటుగా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, చెరువులు, నాలాల కబ్జాలకు అడ్డుకట్ట వేయటం, ఆక్రమణలను తొలిగించటం, అక్రమ నిర్మాణాలు, నిబంధనలను పాటించని ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, ప్రకటనల తొలిగింపు, ట్రాఫిక్ నిర్వహణ, తాగునీరు, విద్యుత్తు సరఫరాలో హైడ్రా కీలకంగా వ్యవహరించేలా విధులు అప్పగించాలని సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ అమ్రపాలీ, జీహెచ్‌ఎంసీ ఈవీడీఎం కమిషనర్ రంగనాథ్, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి పాల్గొన్నారు.