సాధారణంగా మనిషి స్వార్థపరుడు. తన ఆధిపత్యాన్ని ఏ స్థాయిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కొనసాగించా లనుకుంటాడు. దీంతో తన లక్ష్యసాధనకు పొరుగువారితో పోరు జరపడానికి సిద్ధ పడుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే తోటివారితో కలహాలు, అక్రమాలకు తెర లేపుతాడు. ఈ కారణంగానే కాలానుగుణంగా రాజ్య విస్తరణ, యుద్ధాలు, ప్రపంచ దేశాల మధ్య వైరం పెరుగుతు వచ్చాయి. నేటికీ రష్యా ఉక్రెయిన్ మధ్య, ఇజ్రాయెల్ పాలస్తీనా ప్రాంతాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి. చిన్నచిన్న విషయాలకూ పెద్దపెద్ద యుద్ధాలు జరుగుతున్న ప్రస్తుత సమయంలో క్షమాగుణం ఆవశ్యకత, ప్రాధాన్యాలను విధిగా రేపటి తరం వారికి తెలియజెప్పాలి.
ప్రతీ ఒక్కరూ క్షమాగుణం కలిగి ఉండాలనే ఈ సృష్టి బోధిస్తున్నది. ఏ మతమైనా దయ, క్షమాగుణాలను కలిగి ఉండాలనే నొక్కి చెబుతున్నది. అయితే, మానవుని స్వభావం క్షణక్షణం మారుతుంది. దీంతో కుటుంబసభ్యుల నుంచి దేశాల వరకు స్పర్ధలు పొడచూపుతూ, మానవత్వం పోయి మారణహోమం జరుగుతున్నది. ముఖ్యంగా కుటుంబ స్థాయినుంచి పిల్లలకు చదువుతోపాటు పై సుగుణాలతోపాటు సహకారం, అహింస, సత్యం, ధర్మం వంటి వాటినీ ఇంట్లో వృద్ధులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు బోధించాలి. నైతిక విలువలు, మానవీయ ధోరణులు నూరిపోయాలి. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న విపరీతమైన హింస, అశ్లీలానికి ఈ రకంగా అడ్డుకట్ట వేయాలి.
పిల్లలు, యువత, పెద్దలు సెల్ ఫోన్లకు బానిసలుగా మారకుండా చూడాలి. గౌతమ బుద్ధుడు, గాంధీజీ, రామకృష్ణ పరమహంస, మదర్ థెరిస్సా, వివేకానంద, నెల్సన్ మండేలా వంటి వారి సూక్తులు, జీవితాదర్శాలు పిల్లలకు నేర్పాలి. అస్తమానం చదువు, గ్రేడులు, ర్యాంకులు, ప్యాకేజీలు గురించే కాకుండా మానవ మనుగడ, శాంతియుత జీవనంలోని గొప్పతనాలను తెలపాలి. ఈ ప్రపంచంలో ఎవరూ శాశ్వతం కాదన్న సత్యాన్ని అవగాహన పరచాలి. ఎన్నో విజయాలు సాధించిన నెపోలియన్, అలెగ్జాండర్, అశోకుడు వంటి ప్రముఖుల జీవిత అనుభవాలు, మానవీయతలోని పరమార్థాన్ని తెలపాలి. మహా రచయిత గురజాడ చెప్పినట్లు ‘సొంత లాభం కొంత మానుకొని, పొరుగు వాడికి తోడ్పడవోయ్’ అనే భావనతో అందరం జీవించాలి.
ఐ.ప్రసాదరావు