calender_icon.png 27 October, 2024 | 9:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్షమాగుణం

11-05-2024 12:05:00 AM

పాఠశాలలో గంట మోగగానే ఆరవ తరగతి చదువుతున్న రాహుల్ తరగతి గదికి పరిగెత్తుకుంటూ వెళ్లి తన బెంచ్ మీద కూర్చున్నాడు. నింపాదిగా వచ్చిన మోహన్, రాహుల్ పక్కన కూర్చొని, తెలుగు పుస్తకం తీసుకొని చదువుతున్నాడు. ‘ఇప్పుడు తెలుగు పీరియడ్ కాదు కదరా... ఎందుకు ఆ పుస్తకం తీశావు?’ అని రాహుల్ మోహన్‌ని అడిగాడు. ‘ఊరికే, ఎలాగూ సైన్స్ సార్ ఆలస్యంగా వస్తారు కదాని తెలుగు తీశాను’ అని మోహన్ సమాధానం చెప్పాడు. ‘సరే... నీ ఇష్టం’ అనేసి రాహుల్ సైన్స్ పుస్తకం తీసి చదవడం మొదలు పెట్టాడు. అప్పుడే క్లాస్ రూంలోకి సైన్స్ మాస్టారు వచ్చారు. అందరూ ఒకేసారి లేచి, మాస్టర్‌కు గుడ్‌మార్నింగ్ చెప్పారు. ‘గుడ్ మార్నింగ్ పిల్లలు, కూర్చొండి...’ అని చెప్పి సైన్స్ మాస్ట్టార్ కూర్చోని... ‘ఈ రోజు మూడవ పాఠం మౌఖిక ప్రశ్నలు అడుగుతానని నిన్న చెప్పా కదా? చదువుకొని వచ్చారా?’ అని విద్యార్థులను మాస్ట్టార్ అడిగారు.

 ‘హా.. చదువుకొని వచ్చాము సార్’ అని విద్యార్థులు ముక్తకంఠంతో బదులిచ్చారు. ‘సరే, అయితే... ఒక్కొక్కరిని రెండేసి ప్రశ్నలు అడుగుతాను, సమాధానాలు చెప్పండి’ అని మాస్టర్ రాహుల్‌ని అడిగి సైన్స్ పుస్తకం తీసుకొని ఒక్కొక్కరిని ప్రశ్నలు అడగడం మొదలు పెట్టారు. వరుసగా ముగ్గురిని రెండేసి ప్రశ్నలు అడిగిన తర్వాత రాహుల్ వంతు వచ్చింది. మాస్టర్  అడిగిన మొదటి ప్రశ్నకు రాహుల్ సరైన సమాధానం చెప్పడంతో తరగతి గదిలో అందరూ చప్పట్లు కొట్టారు. రెండవ ప్రశ్నగా ‘పాండ్ స్కేటర్లు అని వేటిని అంటారు?’ అని మాస్టర్ రాహుల్‌ని అడిగారు. రాహుల్‌కు గుర్తుకు రాకపోవడంతో ‘అదీ... అదీ...’ అనుకుంటూ తడబడుతుంటే... తనకన్నా బాగా చదువుతాడని రాహుల్ అంటే మోహన్‌కు ఈర్ష్య దీంతో కావాలని ‘మైదాన జంతువులు’ అని తప్పు సమాధానాన్ని రాహుల్‌కు చెప్పాడు. సమాధానం ఒప్పు అనుకొని పొరపాటుగా దాన్నే మాస్టర్ కు చెప్పాడు. ‘ఏంటి, రాను రాను... ఇలా అయిపోతున్నావు. రాత్రి చదవలేదా? తప్పు సమాధానం చెప్పావు కూర్చో..’ అని చెప్పేసి తర్వాత అదే ప్రశ్నను మోహన్‌ను మాస్టర్ అడిగాడు.

అప్పుడు ‘పాండ్ స్కేటర్లు చెరువు ఉపరితలంపై నివసించే కీటకాలు. ఇవి ఇతర కీటకాలను తింటాయి’ అని సమాధానం చెప్పాడు. దాంతో అందరూ ఒకే సారి చప్పట్లు కొట్టారు. మాస్టర్ మోహన్‌ని మెచ్చుకున్నాడు. ‘చూశావా రాహుల్... కావాలని మోహన్ నీకు తప్పు సమాధానం చెప్పి, మాస్టారుకు సరైన సమాధానం చెప్పాడు... మార్కులు కొట్టేశాడు. అయినా ఇటువంటి జిత్తులమారి వ్యక్తికి ప్రతిదాంట్లో అండగా ఉంటావెందుకు?’ అని రాహుల్‌ని మురళి అడిగాడు. ‘మనకు చెడు చేసిన వ్యక్తికి కూడా మంచి చేయడమే మనిషిగా మన బాధ్యత. మన బాధ్యతను మనం నిర్వర్తించాలి. మామిడి పండ్ల చెట్టు రాళ్ల దెబ్బలు తిని కూడా పండ్లు ఇస్తుంది. అలానే మనం కూడా... అంతేకాకుండా మన తోటి స్నేహితుడి చిన్న చిన్న తప్పులను చూసీ చూడనట్టు వదిలివేయాలి’ అని మురళికి రాహుల్ సమాధానం చెప్పాడు. సైన్స్ క్లాస్ అయిపోయిన తర్వాత అందరూ తర్వాత క్లాస్ కోసం పుస్తకాలు తీసుకొని చదవడం మొదలు పెట్టారు.

 - సయ్యద్ ముజాహిద్ అలీ