21-04-2025 01:43:51 AM
మంచిర్యాల అవినీతికి, గూండాయిజానికి అడ్డాగా మారింది
విచ్చలవిడిగా సాగుతున్న ఇసుక, గంజాయి దందా
బీఆర్‌ఎస్ రజతోత్సవాలను విజయవంతం చేయాలి
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్
మంచిర్యాల, ఏప్రిల్ 20 (విజయక్రాంతి) : కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్దిని మరిచి కాలయాపన చేస్తుందని మాజీ ప్రభుత్వ విఫ్, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ అన్నారు. ఆదివారం నస్పూర్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి 16 నెలలు గడుస్తున్నా చేసిందేమి లేదని, ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందన్నారు. ప్రభు త్వ పనితీరుపై విరుచుకుపడ్డారు. అధికారంలోకి వచ్చేందుకు అడ్డగోలు హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు.
కాంగ్రెస్ నాయకులు ప్రతి పక్షాలను విమర్శించడానికే పరిమితమవుతున్నారన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో 90 శాతం పనులు పూర్తయి ఎన్నికల కోడ్ వల్ల నిలిచిన 10 శాతం పనులు పూర్తి చేసి తామే చేశామంటూ డబ్బాలు కొట్టుకుంటున్నారే తప్ప కొత్తగా చేసిన అభివృద్ధి ఏమి లేదని ఎద్దేవా చేశారు. అభివృద్ధి పనులు చేపట్టకుండా, మాటలతో కాలం గడుపుతున్నారని విమర్శించారు. తిరిగి అధికారం చేపట్టబోయేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనన్నారు. ఈ నెల 27న వరంగల్ జిల్లా వనపర్తిలో నిర్వహించనున్న రజతోత్సవ సభకు జిల్లా నుంచి నియోజక వర్గానికి మూడు వేల మంది చొప్పున హాజరు కావాలని కోరారు.
మంచిర్యాల అవినీతికి,గుండాయిజానికి అడ్డాగా మారింది
మంచి మంచిర్యాల నేడు అవినీతికి, గుండాయిజానికి అడ్డాగా మారిందని బీ ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ఆరోపించారు. జిల్లాలో అవినీతి పేరుకుపోయిందని, డబ్బులు ఇవ్వనిదే సామాన్యుడికి పనులు జరుగడం లేదన్నారు. జిల్లాలో గుండాయిజం పెట్రేగిపోతుందని, అడ్డుకోవాల్సిన సంబంధిత అధికారులు నాయకు లకు భయపడి మిన్నకుంటున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై దాడికి దిగుతుందని మండిపడ్డారు. ఈ విషయంలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన సీపీ దృష్టి సారించి నివారించేందుకు కృషి చేయాలని కోరారు.
విచ్చలవిడిగా సాగుతున్న ఇసుక, గంజాయి దందా
జిల్లాలో విచ్చలవిడిగా ఇసుక అక్రమ రవాణాతోపాటు గంజాయి దందా సాగుతుందని, దీనిని అరికట్టడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని బీ ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ విమర్శించారు. ముఖ్యంగా చెన్నూర్ నియోజక వర్గంలో మైనింగ్, ఇసుక దందాలు శృతిమించాయన్నారు. వందలాది లారీల ఇసుక అక్రమంగా తరలిపోతున్నా అధికారులు కండ్లు మూసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే మైనింగ్ కళాశాల ఏమయ్యిందని నాయకులను ప్రశ్నించారు.
మద్యం, గంజాయి, మత్తు పదార్థాల వినియోగం విపరీతంగా పెరిగిపోయిందని, మంచిర్యాల జిల్లా గంజాయి దందాకు అడ్డాగా మారిందన్నారు. ఇంత జరుగుతున్నా దీనిని నివారించాల్సిన అధికారులు పట్టించుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. దందాలను అరికట్టడంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలమైందన్నారు. ప్రజాధనాన్ని దోచుకుంటున్నా, అవినీతిని అడ్డుకోకుండా అధికారులు మౌనంగా ఉండటం శోచనీయమన్నారు. ఈ విలేకరుల సమావేశంలో బీ ఆర్ ఎస్ యువ నాయకులు నడిపెల్లి విజిత్ రావు, సీనియర్ నాయకులు రాజా రమేశ్, నాయకులు పల్లె భూమేశ్, అక్కూరి సుబ్బయ్య, కలగూర రాజ్ కుమార్, టీబీజీకేఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.