calender_icon.png 27 December, 2024 | 1:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిబంధనలు మరిచి నిర్మాణాలు

02-08-2024 02:17:28 AM

  1. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏళ్లుగా బహుళ అంతస్తుల నిర్మాణం 
  2. ఇష్టారాజ్యంగా ఇళ్ల పైనుంచి క్రేన్ ఆపరేటింగ్ 
  3. అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం
  4. తాజాగా ఓ ఇంటిపై పడిన క్రేన్ బకెట్

రాజేంద్రనగర్, ఆగస్టు 1: బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బహుళ అంతస్తుల నిర్మాణాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. హైటెక్ సిటీకి చేరువలో ఉండడం, నగరానికి ఆనుకొని ఉండడంతో ఇక్కడ బిల్డర్లు ఎక్కువగా నిర్మాణాలు చేపడుతున్నారు. అదేవిధంగా కొను గోలుదారులు సైతం ఇక్కడ ఫ్లాట్లు తీసుకొని నివాసం ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఇదంతా బాగానే ఉన్నా.. బిల్డర్లు అడ్డగోలుగా నిర్మాణాలు చేపడుతుండడం, ఏ మాత్రం నిబంధనలు పాటించకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. తమ ఇష్టారాజ్యంగా ప్రతిరోజు 24 గంటలు పనులు చేపడుతుండడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. 

అంతా నిబంధనలకు విరుద్ధమే.. 

మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఓం నగర్ ప్రాంతంలో అబ్బం పేరుతో చాలా రోజులుగా బహుళ అంతస్తుల నిర్మాణం చేపడుతున్నారు. నిర్మాణం ప్రారంభం నుంచి కూడా బాగా దుమ్ముధూళి రావడంతో స్థానికులు ఇక్కట్లకు గురయ్యారు. ఈ నేపథ్యంలో మూడుసార్లు మున్సిపల్ అధికారులకు సైతం ఫిర్యాదు చేశారు. నెలరోజుల్లో సమస్య పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చిన అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదని స్థానికులు చెబుతున్నారు.

ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి నిలోఫర్ అనే మహిళ తన చంటిబిడ్డతో కలిసి ఇంటి డాబాపై వాకింక్ చేస్తుండగా ఒక్కసారిగా అబ్బం కన్‌స్ట్రక్షన్‌కు చెందిన భారీ క్రేన్ బకెట్ ఆమె ఇంటిపై పడిపోయింది. దీంతో మహిళ, చిన్నారితో పాటు స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయాయ్యరు. భారీ శబ్ధం రావడంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సైట్ ఇన్‌చార్జిపై దాడికి యత్నించడం స్థానికంగా కలకలం సృష్టించింది. సకాలంలో పోలీసులు రావడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. 

భారీగా క్రేన్ల వినియోగం..

బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పదుల సంఖ్యలో బహుళ అంతస్తుల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. భారీ స్థాయిలో క్రేన్లను వినియోగిస్తున్నారు. సదరు క్రేన్లు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఇళ్ల పైనుంచి ఆపరేట్ చేస్తున్నారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. అయినా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఇతరులకు ఇబ్బందులు తలెత్తకుండా నిర్మాణాలు చేపట్టాలి.

అదేవిధంగా దుమ్ముధూళి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అయినా నిర్మాణదారులు పట్టించుకోలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బడా నిర్మాణదారులు ఎక్కడికక్కడ అధికారులతో పాటు నాయకులను మేనేజ్ చేస్తూ తమ పని కానిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏదైనా పెద్ద సంఘటన జరిగినప్పుడు హడావుడి చేయడం.. ఆ తర్వాత పట్టించుకోకపోవడం పరిపాటిగా మారుతోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు సమస్యలను పరిష్కరించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.