calender_icon.png 12 October, 2024 | 10:55 AM

రికార్డుస్థాయి నుంచి తగ్గిన ఫారెక్స్

12-10-2024 12:00:00 AM

 న్యూఢిల్లీ, అక్టోబర్ 11: దేశం వద్దనున్న విదేశీ మారక నిల్వలు రికార్డు గరిష్ఠస్థాయి నుంచి దిగివచ్చాయి.  శుక్రవారం ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాల ప్రకారం  అక్టోబర్ 4తో ముగిసిన వారంలో ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) రిజర్వులు 3.709 బిలియన్ డాలర్లు తగ్గి 701.176 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి.

అంతక్రితం వారం ఇవి భారీగా 12.588 బిలియన్ డాలర్లు పెరిగి 704.885 బిలియన్ డాలర్ల ఆల్‌టైమ్ గరిష్ఠస్థాయికి చేరిన సంగతి తెలిసిందే.  700 బిలియన్ డాలర్ల స్థాయిని అధిగమించడం ఇదే ప్రధమం. తాజా సమీక్షావారంలో కూడా నిల్వలు తగ్గినప్పటికీ, 700 బిలియన్ డాలర్లపైనే నిలిచి వున్నాయి. 

విదేశీ మారక నిల్వల్లో ప్రధాన భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు 3.511 బిలియన్ డాలర్లు తగ్గి 612.643 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి.అమెరికా డాలరుయేతర కరెన్సీలైన యూరో, పౌండు, యెన్ తదితర విదేశీ కరెన్సీల విలువ డాలరుతో పోలిస్తే తగ్గుదల, పెరుగుదలను కరెన్సీ ఆస్తుల లెక్కింపులో పరిగణనలోకి తీసుకుంటారు. 

తగ్గిన బంగారం నిల్వలు

ఆర్బీఐ వద్దనున్న బంగారం నిల్వలు కూడా సమీక్షావారంలో  40  మిలియన్ డాలర్లు తగ్గి 65.756 బిలియన్ డాలర్లకు చేరాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్‌డీఆర్‌లు) 123 మిలియన్ డాలర్లు పెరిగి18.425 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. ఐఎంఎఫ్ వద్దనున్న రిజర్వులు 35 మిలియన్ డాలర్లు  తగ్గి 4.352 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి.