21-03-2025 01:42:44 AM
కాపాడు కోకుంటే జీవ వైవిద్యానికి విఘాతం..
నేడు ప్రపంచ అటవీ దినోత్సవం
మంచిర్యాల, మార్చి 20 (విజయక్రాంతి) : మానవునితో పాటు సకల జీవకోటి మనుగడకు ఆధారం అడవులు.. భూగోళంపై జీవరాశుల పరిణామక్రమంలో విద్యావంతుడైన నేటి ఆధునిక మానవుడు తన విజ్ఞానంతో వనరులను విపరీతంగా వినియోగించుకుంటూ తనను రక్షించే అడవులను సైతం మితిమీరిన కోరికలతో, దుష్ట చేష్టలతో అటవీ సంపదను నాశనం చేస్తూ తన మనుగడని ప్రశ్నార్థకం చేసుకుంటున్నాడు. ఎన్నో జీవులకు రక్షణగా ఉండే అడవి ఆవరణ వ్యవస్థను చిన్నా భిన్నం చేస్తున్నాడు. జీవుల మనుగడకు ఆధారమైన ఆహారపు గొలుసును కాపాడే వనాలను విచ్చల విడిగా నరికి వేస్తూ సకల జీవ కోటి వినాశనానికి కారణమవుతున్నాడు.
అడవి అంటే అమ్మలాంటిది. అన్ని జీవులను అక్కున చేర్చుకుని అమ్మలా కాపాడుతుంది. ఆహారం, ఔషధాలను ఇస్తుంది. ఆశ్రయంతో పాటు మానవుని మనుగడకు కావలసిన ప్రాణవాయువును ఇస్తుంది. ఇలా అన్ని విధాల ఆదుకుంటుంది. అందుకే అడవి తల్లి లాంటిదని అంటారు. అడవి తల్లికి దండాలు అని కొలుస్తారు, వనదేవతలు అని పూజిస్తారు. అందుకే అడవులు కేవలం మానవుని కోసం మాత్రమే కాదు అది సకల ప్రాణుల మనుగడ కోసం అని తెలుసుకుందాం భావితరాలను కాపాడుకుందాం.
అడవుల పరిరక్షణ ప్రభుత్వాలు ఎన్ని కోట్లాది రూపాయలు వెచ్చించినా అవినీతికి, స్మగ్లర్ల ధన దాహానికి అడవి తల్లి బలై బక్క చిక్కిపోతుంది.. ఒక్క చెట్టును నరికితే.., రెండు మొక్కలు నాటి వాటిని కాపాడాలి అని, రహదారుల పక్కన పెద్దగా ఎదిగిన ఒక చెట్టును తొలగిస్తే తొమ్మిది మొక్కలు నాటి పెద్దగా ఎదిగేంత వరకు సంరక్షించాలి అని పర్యావరణ చట్టాలు నొక్కి చెబుతున్నా పాలకుల చెవులకు వినపడటం లేదు. అందువలన పచ్చదనాన్ని పండించే అటవీ సంపద అందమైన అబద్ధంగా మిగిలిపోతుంది.
*అడవులను నరికితే అన్ని నష్టాలే..
*ఆహార ఉత్పత్తులు తగ్గిపోతాయి.
*-వర్షపాతం తగ్గి కరువు ఏర్పడుతుంది.
*-భూగర్భజలాలు అడుగంటుతాయి.
*గాలిలో కార్బన్ డయాక్సైడ్ పెరిగిపోయి గ్లోబల్ వార్మింగ్ ఏర్పడి తద్వారా ప్రకృతి వైపరీత్యాలు కలుగుతాయి.
*గ్రీన్ హౌస్ వాయువులు పెరుగుతాయి.
*తీర ప్రాంతాల్లో సునామీ లాంటి జల ప్రళయాలు ఏర్పడుతాయి.
*భూసారం కొట్టుకు పోతుంది.
అటవీ సంపద వల్ల లాభాలు...
ఆహారం, ఆశ్రయం, ఔషధాలు, అటవీ ఉత్పత్తులు, కలప, కాగితం, పండ్లు, పట్టు, పత్తి, తేనె, జిగురు, సుగంధ ఉత్పత్తులు మొదలగునవి ఎన్నో లభిస్తాయి. జంతువులు వదిలే కార్బన్ డయాక్సైడ్ ను గ్రహించి మనకు అవసరమైన ప్రాణవాయువును అందిస్తాయి. బాగా పెరిగిన ఒక చెట్టు సుమారు 25 వేల కిలో మీటర్లు తిరిగిన కాలుష్యాన్ని నివారిస్తుంది. ఒక హెక్టారు గ్రీన్ బెల్ట్ ఏరియా 30 నుంచి 50 టన్నుల దుమ్ము కణాలను పీల్చుకుంటుంది. 100 చదరపు మీటర్లు ఆవరించి ఉన్న చెట్టు ఆకులు ప్రతి రోజు 1 కిలో గ్రామ్ ఆక్సిజన్ విడుదల చేస్తుంది.
మన అడవులు జీవ వైవిధ్యానికి నిలయాలు
జిల్లా అడవుల్లో వందలాది రకాల వన్యప్రాణులు అటవీ సంపదను కాపాడుతూ సతత హరితంతో సుమారు 6895.17 చ.కి.మీటర్లు, సుమారు 42.8 శాతంతో పచ్చని గొడుగుల్లా ఉండేవి. వన్య జీవులైన పెద్దపులి, చిరుత పులి, కొండ సింగం, తోడేళ్ళు, గుంత నక్కలు, ఎలుగు బంట్లు, అడవి పందులు, జింకలు, సాంబార్, పొడల దుప్పి, ముళ్ళ పంది, రేచు కుక్కలు, దుప్పులు తదితరాలతో పాటు పక్షి జాతులైన అడవి కోళ్ళు, పాల పిట్టలు, నెమళ్ళు, మంగలి పిట్టలు, కౌజు పిట్టలు, చిలుకలు, పావురాలు, గద్దలు, కాకులు, మైనా పిట్టలు, వడ్రంగి పిట్టలు లాంటి అరుదైన పక్షులు, సరిశ్రుపాలతో జీవ వైవిధ్యానికి నిలయాలుగా ఉండేవి.
ప్రతి వ్యక్తి మొక్కలు నాటిసంరక్షించాలి
ప్రతి వ్యక్తి తన పుట్టిన రోజుతో పాటు అన్ని శుభ దినాల్లో, శుభకార్యాల్లో మొక్కలు ( పండ్లు లేదా నీడ ) నాటి సంరక్షించాలి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అటవీ శాఖ అడవుల పెంపకం చేపట్టాలి. సామాజిక అడవులు విరివిగా పెంచాలి. భారత అడవి చట్టం 27, తెలంగాణ ఫారెస్ట్ 7, భారత పర్యావరణ చట్టాలను ఖచ్చితంగా అమలు చేయాలి. చట్టాల ప్రకారం 33 శాతం అడవుల సమతుల్యతను కాపాడాలి. అడవులు ఉంటేనే అన్నీ ఉంటాయి.
మానవునితో పాటు ఎన్నో ప్రాణాలు హాయిగా బ్రతకడానికి ఆశ్రయం దొరుకుతుంది. ప్రాణ ప్రదమైన అడవి తల్లిని ఇకనైనా మేల్కొని అడవుల ప్రాధాన్యతను తెలిసుకొని అడవుల పెంపకంతో పాటు సంరక్షణ కొరకు అందరం చేతులు కలిపి ప్రజల్లో మన వంతుగా చైతన్యం తెచ్చేందుకు అడుగులు వేద్దాం. అడవుల మనుగడకు మన వంతుగా చేయూతనిచ్చి పచ్చని గొడుగులను కాపాడుకుందాం.
గుండేటి యోగేశ్వర్, పర్యావరణవేత్త, మంచిర్యాల